SRH vs MI: ముంబై ఇండియన్స్ విధ్వంసం.. దంచి కొట్టిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.. ఎస్‌ఆర్‌హెచ్ ముందు భారీ టార్గెట్

దంచి కొట్టిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.. హైదరాబాద్ ముందు భారీ టార్గెట్

SRH vs MI: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అతి తక్కువ బంతుల్లోనే భారీ పరుగులు చేయడంతో ముంబై 235 పరుగులు చేసి సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్ ఉంచింది.

  • Share this:
    ఐపీఎల్ 2021లో భాగంగా అబుదాబి వేదికగా ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై పూర్తిగా విరుచుకపడి సిక్సులు, ఫోర్లతో మైదానంలో అలజడి సృష్టించాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడంటే ఇషాన్ కిషన్ విధ్వంసం ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. అయితే మరో ఎండ్‌లో రోహిత్ శర్మ (18) అంతకగా ఆకట్టుకోలేకపోయాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మహ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (10) మరోసారి నిరాశ పరిచాడు. ఇక ఇషాన్ కిషన్ విధ్వంసం మాత్రం అర్ద సెంచరీ పూర్తయిన తర్వాత కూడా కొనసాగింది. కేవలం 32 బంతుల్లో 84 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. ఉమ్రన్ మాలిక్ బౌలింగ్‌లో వృద్దిమాన్ సాహకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన కిరాన్ పొలార్డ్ (13) నిరాశ పరచగా.. జేమ్స్ నీషమ్ (0) డకౌట్ అయ్యాడు.

    అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇషాన్ కిషన్‌లాగ చెలరేగిపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. సూర్యకుమార్ యాదవ్ తన విధ్వంసాన్ని ఆపలేదు. సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 13 ఫోర్లు. 3 సిక్సులు ఉన్నాయి. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ విధ్వంసంతో ముంబై ఇండియన్స్ తమ ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 9 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే 170 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ముంబై బ్యాటర్లు చెలరేగిపోయినట్లు తెలుస్తున్నది.







    ఇక 236 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజరస్ 7 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. ఓపెనర్లు జాసన్ రాయ్ (34), అభిషేక్ శర్మ కలసి ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరూ అవుటవడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ పరుగుల వేగం తగ్గింది. కాగా, ప్రస్తుతం సన్‌రైజర్స్ ఉన్న స్థితిలో టార్గెట్ 170కి తగ్గిపోవడంతో ముంబై జట్టు ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది.
    Published by:John Naveen Kora
    First published: