news18-telugu
Updated: November 14, 2020, 8:08 PM IST
ప్రతీకాత్మక చిత్రం
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. వచ్చే ఐపీఎల్ (2021 సీజన్) తర్వాత పూర్తిగా క్రికెట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ తర్వాత తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నాడు ఈ మిస్టర్ కూల్.. గత ఏడాది రైతుగా మారి, రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ వ్యవసాయం చేశాడు. స్వయంగా పొలం దున్నుతూ పుచ్చకాయలను పండించాడు ధోనీ. తాజాగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అతడు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అత్యధిక పోషక విలువలు కలిగి.. రైతులకు కాసులు కురిపిస్తున్న.. కడక్‌నాథ్ కోళ్ల పెంపకంపై ధోనీ దృష్టిసారించినట్లు సమాచారం.
రాంచీలోని ఫాంహౌజ్‌లో ఆర్గానిక్ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పే దిశగా ధోనీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అతడి టీమ్ 2 వేల కడక్‌నాథ్ కోడి పిల్లలను ఆర్డర్ చేసినట్లు సమాచారం. డిసెంబరు 15న రాంచీకి డెలివరీ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ గిరిజన రైతు వినోద్ మెండాతో ధోనీ టీమ్ ఒప్పందం కుదుర్చుకుంది. కడక్‌నాథ్ కోళ్ల పెంపకం గురించి ధోనీ తమను సంప్రదించాడని మధ్యప్రదేశ్‌లోని జబువాలో గల కడక్‌నాథ్ ముర్గా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఐఎస్ తోమర్ వెల్లడించారు. ఐతే ఆ సమయంలో తమ వద్ద కోడి పిల్లలు అందుబాటులో లేనందున మరో రైతు ఫోన్ నంబరు ఆయనకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో అతి త్వరలోనే కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారంలోకి ధోనీ దిగనున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కడక్‌నాథ్ కోళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వీటి మాంసంలో కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణ చికెన్‌లో కేజీ మాంసానికి 214 మి.గ్రా. కొలెస్టరాల్, 16-17 శాతం ప్రొటీన్స్ ఉంటాయి. అదే కడక్‌నాథ్ చికెన్‌లో కేజీ మాంసానికి 184 మి.గ్రా. కొలెస్టరాల్, 27-28 శాతం ప్రోటీన్స్ ఉంటాయి. అందులో ఉన్న పోషక విలువ కారణంగా కడక్‌నాథ్ కోడిమాంసం కిలో రూ.700 నుంచి వెయ్యి దాకా పలుకుతోంది. కోడి పిల్ల ఖరీదు రూ. 100. ఒక్క కోడి గుడ్డును రూ.50కు అమ్ముతున్నారు. కడక్‌నాథ్‌కు ఇంత ధర ఎందుకో తెలుసా? ఈ కోళ్లలో ప్రతీది ప్రత్యేకతే..! కడక్‌నాథ్ కోళ్లు నల్లగా ఉంటాయి. మాంసం, గుడ్లు కూడా నలుపు రంగులోనే ఉంటాయి. ఈ కోళ్ల మాంసంంలో ఎన్నో పోషక విలువలతో పాటు అరుదైన ఔషధ లక్షణాలు ఉన్నాయి.
కడక్‌నాథ్ కోళ్ల స్వస్థలం మధ్యప్రదేశ్. అందులోనూ జబువా ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా వీటిని పెంచుతున్నారు. జబువాతో పాటు అలీరాజ్‌పూర్‌లోని భీల్, భిలాలా తెగ ప్రజలు వందల ఏళ్ల నుంచి ఈ జాతి కోళ్లను పెంచుతున్నారు. రాజస్థాన్, గుజరాత్‌లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ కోళ్లు కనిపిస్తాయి. మొదట గిరిజనులు, కొండప్రాంతాల ప్రజలు కడక్‌నాథ్ కోళ్లను పెంచేవారు. ఐతే జబువాలోని కృషి విజ్ఞానకేంద్రం.. కడక్‌నాథ్ కోళ్ల పెంపకంపై స్థానికుల్లో అవగాహన కల్పిస్తుండడంతో ఫామ్స్ సంఖ్య పెరుగుతోంది. ఇక ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లోనూ కడక్‌నాథ్ కోళ్ల పెంపకంపై వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ధోనీ కూడా కడక్‌నాథ్ కోళ్ల పెంపకంపై దృష్టి సారించాడు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 14, 2020, 7:52 PM IST