MITHALI RAJ SCRIPTS HISTORY WITH 5TH CONSECUTIVE ODI FIFTY AND CROSSED 20000 CAREER RUNS JNK
Mithali Raj: చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్.. మహిళా క్రికెట్‌లో మిథాలీ రికార్డుల మోత
మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్ (PC: BCCI)
Mithali Raj Records: మహిళా క్రికెట్ సచిన్ టెండుల్కర్ అని పిలచుకునే మిథాలీ రాజ్ లేటు వయసులో కూడా రికార్డుల మోత మోగిస్తున్నది. వన్డేల్లో వరుసగా ఐదో అర్దసెంచరీతో పాటు.. కెరీర్‌లో 20 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచింది.
టీమ్ ఇండియా (Team India) వన్డే, టెస్టు మహిళా జట్ల కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj)క్రికెట్‌లో (Cricket) అరుదైన మైలు రాయిని అందుకున్నది. టెస్టు, వన్డే, లిస్ట్ ఏ, ఫస్ట్ క్లాస్, టీ20 మ్యాచ్‌లలో కలిపి 20 వేల పరుగులు చేసిన ఏకైక మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. మంగళవారం హరుప్ పార్క్‌లో ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో మిథాలీ 107 బంతుల్లో 63 పరుగులు చేసింది. ఈ క్రమంలో మిథాలీ అన్ని ఫార్మాట్లలో కలిపి 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నది. మహిళా క్రికెట్‌లో సచిన్ (Sachin Tendulkar) అని మిథాలీని పిలుస్తుంటారు. గత 20 ఏళ్లకు పైగా ఆమె క్రికెట్ ఆడుతున్నది. హైదరాబాద్‌కు చెందిన మిథాలీ టీమ్ ఇండియా తరపున ఎన్నో ఎన్నో మ్యాచ్‌లు ఆడారు. ప్రపంచ క్రికెట్‌లో 200పైగా వన్డే మ్యాచ్‌లు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్ కూడా మిథాలీనే.
ఇక ఈ మ్యాచ్‌లో అర్ద సెంచరీ చేయడం కూడా ఒక రికార్డు. ఇది మిథాలీకి వరుసగా ఐదో అర్ద సెంచరీ కావడం విశేషం. తన కెరీర్‌లో వరుసగా ఐదు అర్ద సెంచరీలు చేయడం ఇది రెండో సారి. గతంలో ఇంగ్లాండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ మాత్రమే ఈ ఫీట్ సాధించింది. ఇక వన్డేల్లో ఇప్పటికే అత్యధిక పరుగల రికార్డు మిథాలీ చెంతనే ఉన్నది. మిథాలీ వన్డేల్లో 7304 పరుగులు, టెస్టుల్లో 669, టీ20 మ్యాచ్‌లలో 2364 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో క్రికెటర్ మిథాలీ రాజ్. 2017లో జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా 7 అర్దసెంచరీలు నమోదు చేసింది. ఈ రికార్డు ఇప్పటికి ఎవరూ చెరపలేదు. వరల్డ్ కప్‌లో 1000 పరుగులు చేసిన ఏకైక భారత మహిళా క్రికెటర్‌గా కూడా రికార్డు సృష్టించింది.
ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ (63) యాష్కిత్ భాటియా (35), రిచా ఘోష్ (32) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 225 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్ డార్సి బ్రౌన్ 4 వికెట్లు తీసి టీమ్ ఇండియాను దెబ్బ తీసింది. ఇక 226 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 41 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 227 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు రాచెల్ హైన్స్ (93), అలిసా హీల్ (77) రాణించడంతో ఆ జట్టు సునాయాసంగా గెలిచింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 24న రెండో వన్డే జరుగనున్నది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.