Team India: టీమ్ ఇండియా సీనియర్ల మధ్య గొడవలు.. కోహ్లీ కెప్టెన్సీ వదిలేయడానికి అదే కారణమా?

విరాట్ కోహ్లీపై బీసీసీఐకి పిర్యాదు చేసిన సీనియర్ క్రికెటర్ (PC: BCCI)

విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోహ్లీ ప్రకటన వెనుక పెద్ద స్టోరీనే ఉందని ఒక కథనం వెలువడింది. జట్టులోని సీనియర్లతో సఖ్యత లేకపోవడంతో పాటు కోహ్లీ యాటిట్యూడ్ ఇబ్బంది కరంగా మారిందని ఒక సీనియర్ క్రికెటర్ బీసీసీఐకి పిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని సమాచారం.

 • Share this:
  'కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించడానికే టీ20 ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్‌ బై చెబుతున్నాను. మిగిలిన రెండు ఫార్మాట్లపై మాత్రమే దృష్టిపెట్టడం ద్వారా బ్యాటర్‌గా మరింత రాణించాలని అనుకుంటున్నాను'- టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) తర్వాత కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) చేసిన వ్యాఖ్యలు. కోహ్లీ చేసిన వ్యాఖ్యలు సబబుగానే ఉండటంతో అందరూ అదే నిజమని కూడా భావించారు. కానీ కెప్టెన్సీ వదిలేయడానికి మరో కారణం ఉందనే వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా టీమ్ ఇండియాలోని (Team India) సీనియర్ క్రికెటర్ ఒకరితో పాటు సహాయక సిబ్బందితో కోహ్లీకి విభేదాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇంగ్లాండ్ పర్యటనలో (England Tour) కోహ్లీ అంచనాల మేరకు రాణించలేకపోయాడు. పదే పదే ఆఫ్ స్టంప్ అవతల వెళ్లే బంతులను వెంటాడి.. ఔటైన విషయం తెలిసిందే. అతడు టెక్నిక్ మార్చుకోవాలని నెట్ ప్రాక్టీస్ సందర్భంగా ఒక సహాయక కోచ్ చెప్పడంతో అతడిపై కోహ్లీ తీవ్ర స్థాయిలో మండిపడినట్లు సమాచారం. బ్యాటింగ్ ఎలా చేయాలో తనకు తెలుసని.. తనకు ఒకరు చెప్పడం నచ్చదంటూ అతడిపై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

  ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా కోహ్లీ, సహాయక సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అంతే కాకుండా కోహ్లీ తీరుతో ఒక సీనియర్ క్రికెటర్ కూడా ఇబ్బంది పడినట్లు 'టెలిగ్రాఫ్' పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. కోహ్లీ కారణంగా ఇబ్బంది పడిన వారంతా బీసీసీఐ (BCCI) కార్యదర్శ జై షాకు పిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా జై షాతో పాటు గంగూలీ కూడా అక్కడకు వెళ్లారు. ఆ సమయంలోనే కోహ్లీ వ్యవహారాన్ని జై షా దృష్టికి తెచ్చారు. 'కోహ్లీ తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక పోతున్నాడు. అతడు భారత జట్టులోని ఆటగాళ్ల గౌరవాన్ని కోల్పోయాడు. అతడి యాటిడ్యూడ్ కారణంగా జట్టులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇతరులకు స్పూర్తిగా నిలవాల్సిన కెప్టెనే.. సహనం కోల్పోతున్నాడు. అతడితో తాము చాలా ఇబ్బంది పడుతున్నాము' అంటూ సదరు సీనియర్ క్రికెటర్ జై షాకు పిర్యాదు చేసినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

  Moeen Ali : క్రికెట్ లవర్స్ కు షాకిచ్చిన మొయిన్ అలీ.. ఆ ఫార్మాట్ కు స్టార్ ఆల్ రౌండర్ గుడ్ బై..!

  విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ భారంగా మారిందని క్రికెట్ విశ్లేషకులు గత కొంత కాలంగా వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేయాలని డిమాండ్లు కూడా వచ్చాయి. పొట్టి క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మంచి రికార్డ్ ఉంది. గతంలో భారత జట్టును నడిపించిన అనుభవం ఉండటమే కాకుండా.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు నాలుగు సార్లు టైటిల్స్ అందించాడు. అందుకే టీ20 ఫార్మాట్‌లో రోహిత్ కెప్టెన్సీ కోసం ఒత్తిడి వస్తున్నది. మరోవైపు బీసీసీఐ కూడా జట్టులో జరిగిన సంఘటనలపై గుర్రుగా ఉన్నది. రెండేళ్లుగా సెంచరీ చేయకపోవడమే కాకుండా కోచింగ్ స్టాఫ్‌తో గొడవలు పడటం బీసీసీఐకి రుచించలేదు. అందుకే కోహ్లీపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ చెప్పినట్లు సమాచారం. అయితే కోహ్లీ ఎవరితో గొడవ పడ్డాడనే విషయాన్ని మాత్రం బీసీసీఐ బయటకు రానివ్వడం లేదు.
  Published by:John Naveen Kora
  First published: