WPL 2023 Final - MI vs DC Final : తొలిసారి జరుగుతున్న ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 (WPL 2023) ఫైనల్ పోరుకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తలపడనుంది. లీగ్ దశలో గ్రూప్ టాపర్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్ కు అర్హత సాధించింది. ఇక రెండో స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్.. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో యూపీ వారియర్జ్ పై నెగ్గి ఫైనల్ బెర్తును సొంతం చేసుకుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ కోసం ఇరు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్లు పోటీ పడే అవకాశం ఉంది. ఫైనల్ పోరు ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ను జియో సినిమా, స్పోర్ట్స్ 18 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
సమవుజ్జీల సమరం
ఫైనల్ పోరులో ఎవరు ఫేవరెట్ అనే విషయం తేల్చడం చాలా కష్టంగా ఉంది. ఇరు జట్లు కూడా సమానంగా ఉన్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కు హోం క్రౌడ్ అడ్వాంటేజ్ ఉండనుంది. మ్యాచ్ లన్నీ మహారాష్ట్ర వేదికగా జరుగుతుండటంతో ముంబై ఇండియన్స్ కు అభిమానుల సపోర్ట్ ఎక్కువగా ఉంది. యూపీ వారియర్జ్ తో జరిగిన పోరులో నాట్ సీవర్ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. సూపర్ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఓపెనర్ యస్తిక భాటియా ధాటిగా ఇన్నింగ్స్ ను ఆరంభిస్తోంది. హేలీ మ్యాథ్యూస్, అమీలియా కెర్, హర్మన్ ప్రీత్ కౌర్, పూాజా వస్త్రాకర్ లతో జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక బౌలింగ్ లో వోంగ్ అంచనాలకు మించి రాణిస్తోంది. సీవర్, కెర్ లు కూడా బంతితో చెలరేగగలరు.
ఇక అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. మెగ్ ల్యానింగ్ నాయకత్వం ఢిల్లీ క్యాపిటల్స్ కు వరం. బౌలర్లను మార్చడంలో.. ఫీల్డ్ ను సెట్ చేయడంలో మెగ్ ల్యానింగ్ ది ప్రత్యేక శైలి. ఇటీవలె ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాకు 6వసారి కప్పును అందించింది. ప్రస్తుతం అదే దూకుడును ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో కూడా కొనసాగిస్తోంది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా మెగ్ ల్యానింగ్ ఉంది. ఆమెతో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రింగ్స్, మారిజానె క్యాప్ లతో ఢిల్లీ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్ లో క్యాప్ ను ఎదుర్కొనడం అంత సులభం కాదు. ఇరు జట్లు బలంగా ఉండటంతో ఫైనల్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.
తుది జట్లు (అంచనా)
ముంబై ఇండియన్స్
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), హేలీ మ్యాథ్యూస్, యస్తిక భాటియా, నాట్ సీవర్ బ్రంట్, అమెలియా కెర్, పూజా వస్త్రాకర్, వోంగ్, కౌర్, ఖాజీ, కలిత, సైకా
ఢిల్లీ క్యాపిటల్స్
మెగ్ ల్యానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మారిజానె క్యాప్, తానియా భాటియా, క్యాప్సీ, జెస్ జొనాసెన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శిఖా పాండే, పూనమ్ యాదవ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, Mumbai, Mumbai Indians, WPL 2023