MI vs UPW - WPL 2023 : తొలిసారి జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) 2023 ఆఖరి దశకు చేరుకుంది. ఐదు జట్లతో ఆరంభమైన లీగ్ లో ప్రస్తుతం 3 జట్లు మాత్రమే మిగిలాయి. గ్రూప్ టాపర్ గా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) నిలువగా.. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) రెండు.. యూపీ వారియర్జ్ (UP Warriorz) రెండు మూడు స్థానాల్లో వరుసగా నిలిచాయి. టాపర్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్ కు అర్హత సాధించింది. ఇక రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ముంబై, యూపీ జట్ల మధ్య గెలిచే జట్టు మార్చి 26న జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. అంతకంటే ముందు మార్చి 24న జరిగే ఎలిమినేటర్ పోరులో ముంబై ఇండియన్స్ తో యూపీ వారియర్జ్ తాడో పేడో తేల్చుకోనుంది.
ఫేవరెట్ గా ముంబై ఇండియన్స్
భారత సారథి హర్మన్ ప్రీత్ కౌర్ నాయత్వంలోని ముంబై ఇండియన్స్ హాట్ ఫేవరెట్ గా ఈ టోర్నీలో అడుగపెట్టింది. అంచనాలకు తగ్గట్టుగానే వరుస విజయాలతో లీగ్ టాపర్ గా సాగింది. అయితే టోర్నీ ఆఖర్లో ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్జ్ చేతిలో ఓడింది. అయినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ తో సమానంగా 12 పాయింట్లతో నిలిచింది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో వెనుకబడి నేరుగా ఫైనల్ కు చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్, యస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, వోంగ్, హేలీ మ్యాథ్యూస్ లతో ముంబై పటిష్టంగా కనిపిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.
ఇక అదే సమయంలో యూపీ వారియర్జ్ ను కూడా తక్కువ అంచనా వేయలేం. అలీసా హేలీతో పాటు తాలియా మెక్ గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారీస్, సోఫీ ఎకెల్ స్టోన్, అంజలి శర్వాణిలతో యూపీ జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా హీలీ రాణిస్తే యూపీ అడ్డుకోవడం ముంబై జట్టుకు అంత సులభం కాదు. బౌలింగ్ లో కూడా యూపీ పటిష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ అభిమానులను అలరించడం ఖాయంలా కనిపిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ శుక్రవారం రాత్రి గం. 7.30లకు ఆరంభం కానుంది. జియో సినిమాతో పాటు స్పోర్ట్స్ 18 చానెల్స్ ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
తుది జట్లు
ముంబై ఇండియన్స్
హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), హేలీ మ్యాథ్యూస్, యస్తిక భాటియా, నాట్ సీవర్ బ్రంట్, అమెలియా కెర్, పూజా వస్త్రాకర్, వోంగ్, కౌర్, ఖాజీ, కలిత, సైకా
యూపీ వారియర్జ్
అలీసా హీలీ (కెప్టెన్), శ్వేత శెరావత్, సిమ్రాన్, తాలియా మెక్ గ్రాత్, దీప్తి శర్మ, సోఫీ ఎకెల్ స్టోన్, అంజలి శర్వాణి, యశస్రీ, చోప్రా, ఇస్మాయిల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Mumbai Indians, Sports, WPL 2023