MI VS DC DELHI CAPITALS WON THE MATCH BY 4 WICKETS AGAINST MUMBAI INDIANS MI PLAY OFF RACE NOW MORE COMPLICATED JNK
MI vs DC: కష్టపడి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. మ్యాచ్ ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్‌పై కష్టపడి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ (PC: IPL)
MI vs DC: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 18 పాయింట్లకు చేరుకున్నది. ఇక ముంబై జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.
ఐపీఎల్ 2021లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం మధ్యాహ్నం ముంబై ఇండియన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై నిర్దేశించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ కష్టపడి ఛేదించింది. టాపార్డర్ కుప్పకూలడంతో శ్రేయస్ అయ్యర్ (33) తన అనుభవాన్నంతా ఉపయోగించి చివరి వరకు పోరాడాడు. శ్రేయస్ అయ్యర్‌కు రవిచంద్రన్ అశ్విన్ (21) నిలిచాడు. చివరి ఓవర్లో 4 పరుగులు కావల్సి ఉండగా మొదటి బంతికే సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించేశాడు. ఈ మ్యాచ్ ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత కష్టంగా మారాయి. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్ ఎలా సాగిందంటే..
ముంబై ఇచ్చిన 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (8) రనౌట్ అవగా ఫామ్‌లో లేని పృథ్వీషా (6) కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఇక స్టీవ్ స్మిత్ (9) నాథన్ కౌల్టర్-నైల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దూకుడుగా ఆడటానికి ప్రయత్నించిన రిషబ్ పంత్ (26) జయంత్ యాదవ్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో ఢిల్లీ జట్టు 57 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ బ్యాటర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ముంబై మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పుకున్నది.
కానీ ఢిల్లీ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ చివరి వరకు పోరాడాడు. మిగిలిన బ్యాటర్లతో కలసి చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పుతూ స్కోరును నెమ్మదిగా ముందుకు తీసుకొని వెళ్లాడు. ఈ క్రమంలో అక్షర్ పటేల్ (9), హెట్మేయర్ (15) వికెట్లు కూడా పడిపోవడంతో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. అయితే శ్రేయస్ అయ్యర్(33), రవిచంద్రన్ అశ్విన్ (20) కలిసి ఎలాంటి ఛాన్స్ ముంబై బౌలర్లకు ఇవ్వలేదు. చాకచక్యంగా సింగిల్స్ తీస్తూనే మధ్యలో బౌండరీలు రాబట్టారు. ఆఖరి ఓవర్లో 4 పరుగులు కావల్సిన సమయంలో తొలి బంతికే అశ్విన్ సిక్స్ కొట్టి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. దీంతో ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో 132 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలిచింది. అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ విజయంతో లభించిన రెండు పాయింట్లతో కలిపి మొత్తం 18 పాయింట్లకు చేరుకున్నది. ఢిల్లీ జట్టు పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్ కోసం చెన్నై జట్టుతో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నది. ఇక ముంబై జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌లు తప్పక భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అప్పుడే ప్లే ఆఫ్స్‌కు చోటు దక్కే అవకాశం ఉన్నది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.