కొన్నిసార్లు ఇతరుల ద్వారా మనం ప్రేరణ పొందవచ్చు. ఓ యువతి... సాధించిన విజయం ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తోంది. కష్టపడితే అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తోందని నిరూపించింది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా.. తన అనుకున్నా లక్ష్యాన్ని సాధించి అందరి చేత శభాష్ అన్పించుకుంటోంది రేవతి వీరమణి. అసలు ఎవరు.. ఈ రేవతి వీరమణి. ఆమె సాధించిన ఘనత ఏంటి అనుకుంటున్నారా..? అసలు వివరాల్లోకెళితే.. ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయి, తినడానికి తిండికూడా లేని దుర్భరస్థితిలో నుంచి తారా జువ్వలా దూసుకొచ్చిన తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల స్ప్రింటర్ రేవతి వీరమణి.. త్వరలో ప్రారంభంకాబోయే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశాకిరణంలా మారింది. కష్టాలతో సావాసం చేసి స్టార్ అథ్లెట్‌గా ఎదిగింది. ఏకంగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్నే అందుకుంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనాలనేది ప్రతి అథ్లెట్ జీవితకాల స్వప్నం. విశ్వవేదికపై అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు నెగ్గాలనే లక్ష్యంతో.. ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని రేవతి లక్కీగా అందుకుంది. దేశ జెండాను రెపరెపలాడించేందుకు సిద్దమవుతోంది.
రేవతి తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే అనారోగ్యంతో కొద్ది నెలల వ్యవధిలో చనిపోయారు. దీంతో మధురై జిల్లాలోని సాకి మంగళం గ్రామంలో నివసించే 76 ఏళ్ల అమ్మమ్మ అరమ్మాళ్ వద్దకు అక్కాచెల్లెళ్లు చేరారు. స్కూల్లో ఉన్న సమయంలో పరుగులో రేవతి ప్రతిభను గమనించిన తమిళనాడు స్పోర్ట్స్ డెవల్‌పమెంట్ అథారిటీ కోచ్ కన్నన్ ఆమె నైపుణ్యాలకు మెరుగులు దిద్దాడు. అంతేకాదు మధురైలోని లేడీ డోక్ కాలేజీలో ఆమెకు సీటుతోపాటు, హాస్టల్ వసతి లభించేలా సాయం చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో బూట్లు లేకుండానే ప్రాక్టీస్ చేసిన రేవతి అనేక కాలేజీ మీట్‌లతోపాటు 2016 జూనియర్ నేషనల్స్‌లో ఉత్తి కాళ్లతోనే పరుగెత్తి విజయాలు సాధించింది.
2019 వరకు కన్నన్ వద్ద శిక్షణ పొందిన రేవతి ఆ తర్వాత పటియాలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్)లో జాతీయ శిబిరానికి ఎంపికైంది. అప్పటివరకు 100, 200 మీ.లలో పరిగెత్తిన రేవతి.. ఎన్‌ఐఎస్ కోచ్ గలినా బుఖారియా సలహాతో 400మీ.కు మారింది. 2019 ఫెడరేషన్ కప్‌లో 200 మీటర్ల విభాగంలో సిల్వర్ మెడల్ నెగ్గిన రేవతి.. ఇండియన్ గ్రాండ్ ప్రీ 5,6లో 400 మీ.లో స్వర్ణ పతకాలు గెలిచింది. గాయంతో 2021లో పోటీలకు దూరమైంది. గాయంనుంచి కోలుకొని గ్రాండ్‌ప్రీ -4లో 400 మీ. విజేతగా నిలిచింది. ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో 53.71 సె.తో ప్రియా మోహన్, పూవమ్మ తర్వాత మూడో స్థానంలో సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sports, Tamil nadu, Tokyo Olympics