జార్ఖండ్‌లోని మారుమూల గ్రామం.. గిరిజన ప్రాంతం.. ఆర్థిక కష్టాల్లో కుటుంబం.. ఈ సవాళ్లన్నింటినీ దాటి ఓ బాలిక ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌నకు ఎంపికైంది. రాష్ట్రం తరఫున అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన తొలి రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. ఆ యువ రెజ్లర్ పేరు చంచల కుమారి. రాంచీలోని హోత్వార్ గ్రామం.. చంచల స్వగ్రామం. ఆమె తండ్రి నరేంద్రనాథ్ పహాన్ కూలీగా పని చేస్తున్నారు. ఆర్థిక కష్టాల వల్ల కూతురుని చదివించలేకపోయారు. దీంతో గురుకుల పాఠశాలలో చేర్పించాలనుకున్నారు. అయితే జార్ఖండ్ స్టేట్ స్పోర్ట్స్ ప్రొమోషన్ సొసైటీ (జేఎస్ఎస్పీఎస్)లో చంచల సీటు సాధించిది. క్రమంగా రెజ్లింగ్‌లో సత్తాచాటింది. ఇదే క్రమంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన ట్రయల్స్‌లో అద్భుతంగా రాణించి హంగేలీలో ఈ నెల జరిగే ప్రపంచ సబ్‌జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.“చంచల బాగా చదువుతుంది. నేనూ ఆమెను చదివించాలనుకున్నా. కానీ ఆర్థిక కష్టాలు తీవ్రంగా భారమయ్యాయి. ఆ తర్వాత స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఇక ఆమె చదువుకయ్యే ఖర్చు భరించలేక గురుకుల పాఠశాలలో చేరుద్దామనుకున్నాం. అంతకంటే ముందే జేఎస్ఎస్పీఎస్ ట్రయల్స్‌కు చంచల హాజరైంది. అక్కడ పోటీల్లో పాల్గొని అర్హత సాధించి, సీటు సంపాదించింది. రెజ్లింగ్‌ను ఎంపిక చేసుకుంది. ఇప్పుడు ఆమె అంతర్జాతీయ పోటీల్లో పాల్గొననుండడం గర్వంగా ఉంది” అని చంచల తండ్రి పహాన్ చెప్పారు.
చంచల ఇంత ఉన్నతస్థాయికి చేరుకుంటుందని తామెప్పుడూ ఊహించలేదని ఆమె తల్లి మైనో దేవి అన్నారు. అప్పుడప్పుడు తమతో పొలాల్లో కూడా చంచల పని చేసిందని గుర్తు చేసుకున్నారు. ఎంతో కష్టపడి తమను గర్వించేలా చేసిందని హర్షం వ్యక్తం చేశారు. క్రికెట్, హాకీ, ఆర్చరీతో పాటు మిగిలిన క్రీడల్లో ఎందరో సూపర్ స్టార్లను జార్ఖండ్ అందించినా రెజ్లింగ్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వారు లేరు. ఇప్పుడు గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన చంచల ఇంటర్నేషనల్ ఈవెంట్లో తలపడబోతోంది.
కెరీర్లో ఎన్నో ఉత్తమ విజయాలు సాధించే సత్తా చంచలకు ఉందని జార్ఖండ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు భోలానాథ్ సింగ్ అన్నారు. “నేషనల్స్ మీట్లో ఇప్పటికే ఆమె చాలా పతకాలు గెలిచింది. 2017 ఎస్జీఎఫ్ఐ గేమ్స్‌లో రజత పతకం సాధించింది. ఆ తర్వాత వరుసగా రెండు సంవత్సరాలు నిర్వహించిన మీట్స్‌లో స్వర్ణ పతకాలు దక్కించుకుంది. కెరీర్లో ఉన్నతంగా ఎదిగేందుకు ఆమెకు పూర్తి సామర్థ్యం ఉంది. లక్నోలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో సంవత్సరం నుంచి చంచల ట్రైనింగ్ పొందుతోంది. చంచల అంతర్జాతీయ టోర్నీకి ఎంపిక కావడం జార్ఖండ్‌కు గర్వపడే విషయం” అని భోలానాథ్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jharkhand, Sports, VIRAL NEWS, Wrestling