Home /News /sports /

MAYANK AGARWAL RULED OUT FROM FIRST TEST AGAINST ENGLAND AFTER CONCUSSION IN NETS WHO WILL OPEN IN FIRST TEST JNK

INDvENG: తొలి టెస్టు నుంచి మయాంక్ అగర్వాల్ ఔట్.. రోహిత్‌తో కలసి ఓపెనింగ్ చేసేది ఎవరు?

తొలి టెస్టులో రోహిత్‌కు తోడుగా ఓపెనింగ్ చేసేది ఎవరు? (BCCI)

తొలి టెస్టులో రోహిత్‌కు తోడుగా ఓపెనింగ్ చేసేది ఎవరు? (BCCI)

టీమ్ ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కంకషన్‌కు గురయ్యాడు. నెట్స్‌లో మహ్మద్ సిరాజ్ వేసిన బంతి మయాంక్ తల వెనుక భాగంలో బలంగా తగిలింది. దీంతో అతడు ప్రాక్టీస్ వదిలి బయటకు వెళ్లిపోయాడు.

    భారత క్రికెట్ జట్టు (Team India) ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ (England Test Series) ప్రారంభం కాక ముందే అక్కడకు వెళ్లిన ఆటగాళ్లు వరుసగా గాయపడుతున్నారు. ఇప్పటికే ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్ గాయాల బారిన పడి ఇండియాకు తిరిగి వచ్చేశారు. తాజాగా మరో రెండు రోజుల్లో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) గాయపడ్డారు. ట్రెంట్‌బ్రిడ్స్‌లోని నెట్స్‌లో సాధన చేస్తుండగా మహ్మద్ సిరాజ్ వేసిన బంతి మయాంక్ అగర్వాల్ తల వెనుక భాగంలో (Concussion) బలంగా తగిలింది. దీంతో మయాంక్ వెంటనే హెల్మెట్ తీసి అక్కడే కూలబడ్డాడు. వెంటనే భారత ఫిజియో నితిన్ పటేల్ మయాంక్ వద్దకు చేరుకొని కాసేపు అతడితో మాట్లాడాడు. అతడిని పరీక్షించిన నితిన్ పటేల్ అక్కడి నుంచి మయాంక్‌ను తీసుకొని బయటకు వెళ్లాడు. వెళ్లే సమయంలో మయాంక్ తల వెనుక భాగాన్ని రుద్దుకుంటూ కనిపించాడు. కంకషన్ (మెదడుకు హాని చేసేలా తగిలే దెబ్బ) అయిన క్రికెటర్ తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు మయాంక్ అగర్వాల్ పరీక్షల ఫలితాలు వచ్చి అతడు ఫిట్‌గా ఉన్నాడని తేల్చి చెప్పే సరికి సమయం గడిచిపోతుంది. అందుకే బీసీసీఐ మయాంక్ అగర్వాల్ తొలి టెస్టు ఆడటం లేదని ప్రకటించింది. ఇక అగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో రోహిత్ శర్మకు జోడీగా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నది.

    ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇప్పటికే గాయంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇప్పుడు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కంకషన్ కారణంగా తొలి టెస్టుకు దూరమయ్యాడు. బ్యాకప్ ఓపెనర్‌గా అభిమన్యు ఈశ్వరన్ ఉన్నా అతను ఇంత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఈశ్వరన్ దేశవాళీ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. కానీ కీలకమైన సిరీస్‌లో అతడితో అరంగేట్రం చేయించడం అనుమానమే. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కేఎల్ రాహుల్ తొలి టెస్టులో ఓపెన్ చేయడం ఖాయంగానే కనిపిస్తున్నది. కేఎల్ రాహుల్ సాధారణంగా మిడిల్ ఆర్డర్‌లో ఆడటానికే సుముఖత చూపిస్తుంటాడు. కానీ అనుకోని కారణాలతో పలు మార్లు ఓపెనర్‌గా బరిలోకి దిగి మ్యాచ్ విన్నింగ్ గేమ్స్ ఆడాడు. ఈ సారి కూడా కేఎల్ రాహుల్ తిరిగి ఓపెనింగ్ బాధ్యతలు స్వీకరించ తప్పడం లేదు.





    మరోవైపు ఇంగ్లాండ్ పర్యటనకు బ్యాకప్ ప్లేయర్లుగా పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ పేర్లను బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పటికే ప్రకటించారు. మరి కొద్ది గంటల్లో వీళ్లు ఇండియా నుంచి బయలుదేరి ఇంగ్లాండ్ వెళ్లనున్నట్లు సమాచారం. అయితే వాళ్లు ఇంగ్లాండ్ చేరినా తొలి టెస్టులో మాత్రం అందుబాటులో ఉండరు. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఇంగ్లాండ్ వీసాలు వారిద్దరికీ మంజూరు కాలేదు. సోమవారం వారికి వీసాలు వచ్చాయి. దీంతో మంగళవారం ఇద్దరూ ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లి అక్కడే వారం రోజుల పాటు హార్డ్ క్వారంటైన్‌లో గడపనున్నారు.

    ఇక తొలి టెస్టులో కేఎల్ రాహుల్‌తో పాటు మహ్మద్ సిరాస్‌కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ట్రెంట్‌బ్రిడ్జి లోని పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉండటంతో తుది జట్టులో రవీంద్ర జడేజాకు చోటు దక్కే అవకాశం కూడా అనుమానంగానే ఉన్నది. భారత జట్టు నలుగురు పేసర్లతో దిగుతుందని సమాచారం.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Bcci, Cricket, India vs england, KL Rahul, Team india

    తదుపరి వార్తలు