పద్మ పురస్కారాలకు పీవీ సింధు, మేరి కోమ్ సహా పలువురు మహిళా క్రీడాకారులను కేంద్రక్రీడాశాఖ నామినేట్ చేసింది. భారత రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుకు బాక్సింగ్ దిగ్గజం మేరికోమ్ పేరును ప్రతిపాదించింది. ఇక తెలుగు తేజం, బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధుని భారత మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ అవార్డుకు నామినేట్ చేసింది. పద్మశ్రీకి వినేష్ ఫొగట్ (రెజ్లర్), మానికా బట్రా (టేబుల్ టెన్నిస్ ప్లేయర్), హర్మన్ ప్రీత్ కౌర్‌ను ప్రతిపాదించింది క్రీడాశాఖ.
ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ గెలిచిన బాక్సర్ మేరీ కోమ్ 2006లో పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఆ తర్వాత 2013లో పద్మ భూషణ్ పురస్కారాన్ని కూడా సాధించింది. ఈసారి ఆమెకు పద్మ విభూషణ్ అవార్డు వస్తే ఆ ఘనత దక్కించుకున్న నాలుగో స్పోర్ట్స్ పర్సన్‌గా రికార్డులకెక్కుతుంది. అంతకుముందు చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ (2007), క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (2008), మౌంటనీర్ సర్ ఎడ్మంట్ హిల్లరీ (2008)ని పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి.
ఇక బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకుంది. 2017లో ఆమె పేరును పద్మ పద్మభూషణ్ అవార్డుకు క్రీడాశాఖ పరిశీలించినప్పటికీ నామినేట్ చేయలేదు. ఈసారి మాత్రం ఆమె పేరును ప్రతిపాదించింది స్పోర్ట్స్ మినిస్ట్రీ. కాగా, పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mary Kom, Padma Awards, Pv sindhu, Sports