క్రికెట్ (Cricket) లో మన్కడింగ్ అనే పదం వినగానే.. మొదటగా గుర్తుకువచ్చేది టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin). మన్కడింగ్ అంటే.. బౌలర్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ క్రీజు దాటి బయటకు వెళితే.. బౌలర్‌కు రనౌట్ చేసే అవకాశం ఉంటుంది. దీనిని అశ్విన్ 2019 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్‌పై ఉపయోగించడం అప్పట్లో వివాదానికి దారి తీసింది. ఈ విషయంలో కొందరు అశ్విన్‌ను తప్పు బడితే.. మరికొందరు అతన్ని సమర్థించారు. అయితే అంతకముందే టీమిండియా నుంచి వినూ మన్కడ్ రెండుసార్లు ఒకే ఆటగాడిని మన్కడింగ్ చేశారు. 1947-48లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్ బిల్ బ్రౌన్ పదేపదే క్రీజు దాటుతుండడంతో వినూ మాన్కడ్ అతన్ని హెచ్చరించాడు.
మరోసారి బిల్ బ్రౌన్ బంతి వేయకుండానే క్రీజు దాటడంతో మాన్కడ్ బ్రౌన్‌ను మన్కడింగ్ చేశాడు. ఆ తర్వాత రెండో టెస్టులోనూ బ్రౌన్ ఇదే తరహాలో చేయడంతో వినూ మాన్కడ్ ఈసారి అతనికి వార్నింగ్ ఇవ్వకుండానే మన్కడింగ్(రనౌట్ చేశాడు). ఈ చర్య అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. కాగా ఈ వివాదం తర్వాతే వినూకు.. వినూ మన్కడ్ అని పేరు రావడం విశేషం.
అయితే.. ఈ మన్కడింగ్ క్రికెట్ లో విన్పించే ఛాన్స్ లేకుండా పోయింది. ఈ ఏడాది అక్టోబర్‌లో క్రికెట్‌లో కొత్త రూల్స్ రానున్నాయి. మన్కడింగ్ అనేది క్రీడాస్పూర్తికి విరుద్ధమని.. ఇకపై మన్కడింగ్ చేసే అవకాశం లేదని.. దానికి క్రికెట్ రూల్స్ నుంచి తీసేస్తున్నట్లు ఎంసీసీ(MCC) ప్రకటించింది. దీంతో పాటు మరికొన్ని కొత్త రూల్స్‌ను ఎంసీసీ ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో దీనిపై ఒక ప్రకటన విడుదల చేయనుంది. మరి ఎంసీసీ తీసుకురానున్న కొత్త రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ ఎండ్‌కు
మ్యాచ్ సమయంలో క్యాచ్ ఔట్‌కు సంబంధించి ఎంసీసీ చిన్న మార్పు చేసింది. ఫీల్డర్ క్యాచ్ పట్టడానికి ముందు ఇద్దరు బ్యాటర్లు క్రీజులో ఒకరినొకరు దాటితే.. ఇకపై క్రీజులోకి వచ్చే కొత్త బ్యాట్స్‌మన్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వెళ్లాలి. ఇంతకముందు ఏ బ్యాటర్ ఔటైనా.. క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్ నాన్‌స్ట్రైక్ ఎండ్‌కు వెళ్లాలనే నిబంధన ఉంది. తాజాగా ఎంసీసీ దీన్ని సవరించింది.
మన్కడింగ్‌పై నిషేధం
బౌలర్ బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ క్రీజు దాటితే సదరు బౌలర్ అతన్ని ఔట్ చేసే అవకాశాన్ని మన్కడింగ్ అంటారు. అయితే మన్కడింగ్ అనేది క్రీడాస్పూర్తికి విరుద్ధమని.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉండే ఏ బ్యాటర్ అయినా పరుగు కోసం సిద్ధంగా ఉండాలి. దానిలో భాగంగా బ్యాటర్ క్రీజు దాటే అవకాశం ఉంటుంది. ఇకపై బౌలర్ మన్కడింగ్ చేసే అవకాశం లేదని.. క్రికెట్ నిబంధనల్లో భాగంగా లా-41(క్రీడాస్పూర్తికి విరుద్ధం).. లా-38(రనౌట్) ప్రకారం మన్కడింగ్‌ను రూల్స్ నుంచి తొలగించారు. ఇకపై మన్కడింగ్ నిషేధమని ఎంసీసీ పేర్కొంది.
ఇది కూడా చదవండి : సచిన్ తన బ్యాట్ తోనే కాదు వంటతోనూ వార్న్ ను భయపెట్టేశాడండోయ్..
* బంతిని షైన్ చేసేందుకు బౌలర్లు సలైవా ఉపయోగించకూడదని కోవిడ్ సమయంలో ఎంసీసీ పేర్కొంది. తాజాగా ఎంసీసీ పరిశోధనలో బౌలర్లు స్వింగ్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యంపై అది ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని.. అందుకే బౌలర్లు సలైవాను ఉపయోగించద్దని తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో సలైవా ఉపయోగించడం నిషేధం.
* క్రికెట్‌లోని లా 22.1 ప్రకారం.. ఇకపై స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ నిల్చున్న స్థానం నుంచి బంతి కొద్ది దూరంలో వెళ్లినా దానిని వైడ్ గా పరిగణించాలనే కొత్త రూల్‌ను అమల్లోకి తేనుంది.
* డెడ్‌బాల్స్‌తో పాటు కట్‌స్ట్రిప్ దాటిన బంతిని బ్యాటర్ ను టచ్ చేసే విషయంలోనూ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.