LOVLINA BORGOHAIN WON BRONZE MEDAL IN BOXING THIRD MEDAL FOR INIDAN ATHLETE IN TOKYO OLYMPICS JNK
Lovlina Borgohain: చరిత్ర సృష్టించిన లవ్లీనా.. బాక్సింగ్‌లో మూడో ఇండియన్.. ఆ విభాగంలో ఏకైక బాక్సర్
ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన లవ్లీనా బోర్గహైన్ (SAI Media)
మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గహైన్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. బాక్సింగ్‌లో పతకం గెలిచిన మూడో బాక్సర్‌గా.. వెల్టర్ వెయిట్ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారత బాక్సర్‌గా రికార్డు సృష్టించింది.
భారత మహిళా బాక్సర్ (Indian Boxer) లవ్లీనా బోర్గహైన్ (Lovlina Borgohain) చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics) బుధవారం జరిగిన సెమీస్‌లో ఓడిపోయి కాంస్య పతకం (Bronze Medal) గెలుచుకున్నది. భారత ఒలింపిక్ బాక్సింగ్ చరిత్రలో పతకం సాధించిన మూడో బాక్సర్‌గా రికార్డులకు ఎక్కింది. మరోవైపు వెల్టర్ విభాగం (64 నుంచి 69 కేజీలు) విభాగంలో ఒలింపిక్ పతకం సాధించిన తొలి బాక్సర్, 9 ఏళ్ల తర్వాత బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకం కొట్టింది లవ్లీనా కావడం గమనార్హం. మొత్తంగా మేరీ కోమ్ తర్వాత బాక్సింగ్‌లో పతకం అందించిన మహిళగా కూడా చరిత్రలో నిలిచిపోయింది. మరోవైపు ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన తొలిసారే లవ్లీనా పతకం సాధించడం విశేషం. అస్సాంలో పుట్టిన లవ్లీనా ఇప్పుడు దేశమంతా పాపులర్ అయ్యింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు మూడు పతకాలు రాగా.. ఆ పతకాలు సాధించిన ముగ్గురు అథ్లెట్లు కూడా మహిళలే కావడం గమనార్హం. లవ్లీనాకు అంతర్జాతీయ వేదికలపై పెద్దగా అవగాహన లేదు. గత కొంత కాలంగా మాత్రమే తీవ్రమైన ఒత్తిడి ఉండే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతూ వస్తున్నది. మొదట్లో 75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో తలపడిన లవ్లీనా.. ఆ తర్వాత వెల్టర్ వెయిట్‌కు మారింది. తన శరీర స్వభావాన్ని బట్టి ఒకే వెయిట్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుండటంతో 64 నుంచి 69 కేజీల మధ్యలో తలపడే వెల్టర్ వెయిట్‌కు మారింది. ఒలింపిక్స్‌లో బర్త్ కన్ఫార్మ్ చేసుకున్న లవ్లీనా.. దూకుడుగా తన ప్రయాణం మొదలు పెట్టింది. క్వార్టర్ ఫైనల్లో చైనా తైపీకి చెందిన చెన్-నీచిన్తో తలపడి గెలిచింది. చెన్ మాజీ ప్రపంచ చాంపియన్ కావడం గమనార్హం.
ఇక సెమీస్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, టర్కీకి చెందిన సుర్మెనెలితో తలపడింది. ఈ సారి స్వర్ణ పతకం గెలుస్తుందని సుర్మెనెలిపై అంచనాలు ఉన్నాయి. ప్రత్యర్థిపై పంచ్‌లు, హుక్స్, బాడీ షాట్స్‌తో రెచ్చిపోయే సుర్మెనెలితో పోరు లవ్లీనాకు అంత ఈజీగా ఏమీ లేదు. వరుసగా మూడు రౌండ్లలో సుర్మెనెలినే జడ్జీలను ఆకట్టుకున్నది. లవ్లీనా కొన్ని సార్లు పంచ్‌లు విసిరినా.. సుర్మెనెలిపై ఆధిపత్యం సాధించలేక పోయింది. తొలి రెండ్లో 50-45తో సుర్మెనెలి గెలిచింది. తర్వాత రౌండ్లో మరింత రెచ్చిపోవడంతో లవ్లీనా మొత్తం డిఫెన్స్ గేమ్ ఆడింది. చివరి రౌండ్లో ఇక ఏ మాత్రం అడ్డుకోలేక పోయింది. దీంతో టర్కీ బాక్సర్ 5-0తో గెలిచినట్లు న్యాయనిర్ణేతలు ప్రకటించారు.
లవ్లీనా బోర్గహైన్ సెమీస్‌లో ఓడినా దేశవ్యాప్తంగా ఆమెకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఆడిన మొదటి ఒలింపిక్స్‌లోనే పతకం తెచ్చిన లవ్లీనాను పలువురు అభినందిస్తున్నారు. 9 ఏళ్ల తర్వాత బాక్సింగ్‌లో భారత్‌కు పతకం అందించినందుకు ఆమెకు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.