టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) మహిళల బాక్సింగ్ లో (Women Boxing) కాంస్యం (Bronze) గెలిచిన లవ్లీనా బోర్గహైన్ (Lovlina Borgohain) పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతున్నది. మహిళల బాక్సింగ్ వెల్టర్ వెయిట్ డివిజన్లో ఫైనల్ చేరుతుందని ఆశించినా.. ఆమె ప్రపంచ చాంపియన్ సుర్మెనెలిపై సెమీస్‌లో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకున్నది. ఒలింపిక్స్‌లో 9 ఏళ్ల తర్వాత బాక్సింగ్‌లో పతకం తెచ్చిపెట్టి లవ్లీనా రికార్డు సృష్టించింది. అస్సాంలోని గోలాఘాట్ జిల్లా ముఖియా గ్రామంలో 1997 అక్టోబర్ 2న లవ్లీనా జన్మించింది. అదే గ్రామంలో లవ్లీనా తండ్రి చిరు వ్యాపారం చేస్తుంటాడు. లవ్లీనా అక్కలు ఇద్దరూ కిక్ బాక్సింగ్‌లో జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన వాళ్లే. దీంతో అక్కల లాగానే తాను కూడా కిక్ బాక్సింగ్‌ను ఇష్టపడింది. జిల్లా స్థాయిలో పలు పతకాలు సాధించి దూసుకొని పోయింది. ఈ క్రమంలో ఒక రోజు లవ్లీనా స్కూల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించింది. ఆ పోటీల్లో లవ్లీనా టాలెంట్ గుర్తించిన కోచ్ పదుమ్ బోరో ఆమెను కిక్ బాక్సింగ్ నుంచి బాక్సింగ్ వైపు మళ్లించారు. అలా లవ్లీనా బాక్సింగ్ కెరీర్ మొదలు పెట్టింది. మేరీకోమ్ 2012లో బాక్సింగ్‌లో ఒలింపిక్ పతకం గెలవగా.. అదే ఏడాది లవ్లీనా బాక్సింగ్‌లోకి అడుగు పెట్టింది.
2012 నుంచి బాక్సింగ్ కెరీర్‌గా ఎంచుకున్న లవ్లీనా పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నది. 2017లో ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. 2018లో ఢిల్లీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో అరంగేట్రం చేసి 69 కేజీల విభాగంలో కాంస్యం సాధించింది. అదే ఏడాది రష్యాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో కూడా కాంస్యం దక్కించుకున్నది. ఈ రెండు పతకాలే ఆమెను ఒలింపిక్స్‌లో ఆడేలా చేశాయి. అలా ఒలింపిక్స్‌కు తొలి సారి వెళ్లి మళ్లీ కాంస్యమే గెలవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boxing, Olympics, Tokyo Olympics