Chinthakindhi.RamuChinthakindhi.Ramu
|
news18-telugu
Updated: March 13, 2019, 9:52 PM IST
Aaron Finch
Ind vs Aus: లక్ష్యం 273. 132 పరుగులకే ఆరు వికెట్లు డౌన్. ధావన్, కోహ్లీ, ఆదుకుంటాడనుకున్న రోహిత్... ఎవ్వరూ క్రీజులో నిలవలేకపోయారు. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్ అన్యూహ్యరీతిలో పోరాడారు. టాప్ స్టార్ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయిన ఫిరోజ్ షా కోట్లా పిచ్ మీద అతి సులువుగా పరుగులు రాబడుతూ నిలిచారు. 91 పరుగులు జోడించి...ఒకానొక దశలో మ్యాచ్‌పై ఆశలు రేపారు. వాళ్లిద్దరూ ఉన్నంతసేపు భారతజట్టు గెలుస్తోందనే ఆశ కనిపించింది. అయితే వరుస బంతుల్లో వారిద్దరూ అవుట్ కావడంతో భారత జట్టు అతికీలకమైన మ్యాచ్‌లో ఓడి, సిరీస్ ఆసీస్‌కు అప్పగించింది. 2-0 తేడాతో టీ20 సిరీస్ గెలిచిన ఆసీస్... 2-3 తేడాతో వన్డే సిరీస్ కూడా సొంతం చేసుకుని స్వదేశంలో భారత్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది ఆసీస్. 2-0 తేడాతో వెనకబడి, వరుస మ్యాచుల్లో గెలుస్తూ సిరీస్ సొంతం చేసుకోవడం వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు బోలెడంత ఆత్మవిశ్వాసాన్ని నింపే అంశం. ఈజీగా సిరీస్ నెగ్గేస్తారనుకున్న విరాట్ సేనకు ఈ పరాజయం ఓ మేలుకొలుపు లాంటి గుణపాఠం. 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. 15 బంతుల్లో 12 పరుగులు చేసిన ఓపెనర్ శిఖర్ ధావన్, కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 15 పరుగులు మాత్రమే. ఈ దశలో ఓపెనర్ రోహిత్ శర్మతో జతకలిసిన విరాట్ కోహ్లీ... నిలకడగా ఆడుతూ పరుగులు సాధించారు. రెండో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కోహ్లీ, స్టెయినిస్ బౌలింగ్‌లో కీపర్ క్యారేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 22 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత 16 పరుగులు చేసిన పంత్... టర్నర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు కష్టాల్లో పడింది.

కేదార్ జాదవ్
ఈ దశలో వన్డేల్లో 8 వేల పరుగులు పూర్తిచేసుకున్న రోహిత్ శర్మ... వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. 175 వన్డేల్లో విరాట్ కోహ్లీ, 182 మ్యాచుల్లో ఏబీ డివీల్లియర్స్ ఈ ఫీట్ సాధించగా... రోహిత్ 200వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించి గంగూలీతో సమానంగా మూడో స్థానంలో నిలిచాడు. జంపా బౌలింగ్‌లో సిక్సర్ బాదిన విజయ్ శంకర్, ఆ తర్వాతి బంతిని కూడా గాల్లోకి లేపి ఖవాజాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 89 బంతుల్లో 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ... జంపా బౌలింగ్‌లో అవుటయ్యాడు. భారీ షాట్‌కోసం ముందుకొచ్చిన రోహిత్ చేతుల్లోంచి బ్యాటు చేజారిపోయింది. వెంటనే బంతిని అందుకున్న కీపర్ క్యారే వికెట్లను గిరాటేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా... రోహిత్ ఉన్నాడు... గెలిపిస్తాడని ఆశపడిన టీమిండియా అభిమానులు... అతను అవుట్ కావడంతో నిరాశలో కూరుకుపోయారు. వెంటనే జడేజా కూడా డకౌట్ కావడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైంది. అయితే అన్యూహ్యంగా భువనేశ్వర్ కుమార్‌తో కలిసి 91 పరుగులు జోడించిన కేదార్ జాదవ్... ఫలితంపై ఆశలు రేపాడు. అయితే 54 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేసిన భువనేశ్వర్, కమ్మిన్స్ బౌలింగ్‌లో ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే జాదవ్ కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 57 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు కేదార్ జాదవ్. వీరిద్దరూ అవుటైన తర్వాత షమీ 3 పరుగులు చేసి అవుట్ కాగా, కుల్దీప్ యాదవ్ 8 పరుగులు చేసి అవుట్ కావడంతో 237 పరుగులకు భారత జట్టు ఆలౌట్ అయ్యింది. జంపాకు మూడు వికెట్లు దక్కగా, కమ్మిన్స్, రిచర్డ్సన్, స్టెయినిస్లకు తలా రెండు వికెట్లు దక్కాయి.

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం దక్కింది. మొదటి వికెట్‌కు మరో సారి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖవాజా. 14.3 ఓవర్లలో 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 27 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, జడేజా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా వన్డేల్లో రెండో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఖవాజాకు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. 60 బంతుల్లో 4 ఫోర్లతో 52 పరుగులు చేసిన హ్యాండ్‌కోంబ్... అద్భుత ఇన్నింగ్స్‌తో నాలుగో మ్యాచ్‌లో ఫలితాన్ని టర్న్ చేసిన టర్నర్... 20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేశారు.

ఉస్మాన్ ఖవాజా సెంచరీ అభివాదం
20 పరుగులు చేసిన స్టెయినిస్, భువనేశ్వర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపటికే 9 బంతుల్లో 3 పరుగులు చేసిన ఆలెక్స్ క్యారే కూడా కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది, జట్టు స్కోరు 250 దాటించాడు రిచర్డ్సన్. బుమ్రా బౌలింగ్‌లో ఏకంగా 19 పరుగులు సాధించారు కమ్మిన్స్, రిచర్డ్సన్. 15 పరుగులు చేసిన కమ్మిన్స్, భువీ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా 21 బంతుల్లో 29 పరుగులు చేసిన రిచర్డ్సన్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు.

భువనేశ్వర్ కుమార్‌కు సహచరుల అభినందన...
భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా... రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు తలా రెండేసి వికెట్లు దక్కగా...కుల్దీప్ యాదవ్‌కు ఒక్క వికెట్ దక్కింది.
Published by:
Ramu Chinthakindhi
First published:
March 13, 2019, 9:13 PM IST