Lionel Messi: బార్సిలోనాలో మెస్సీ.. పాత కాంట్రాక్టు పునరుద్దరిస్తాడా? అభిమానుల్లో ఉత్కంఠ

మెస్సీతో బార్సిలోనా మళ్లీ ఒప్పందం కుదుర్చుకునేనా?

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఏ క్లబ్ తరపున కాంట్రాక్టులో లేడు. అర్జెంటీనాకు కోపా అమెరికా కప్ గెలిపించిన మెస్సీ.. ప్రస్తుతం బార్సిలోనాతో ఒప్పందాన్ని పునరుద్దిస్తాడా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

  • Share this:
    దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ (Lionel Messi) ఈ ఏడాది చాలా సంతోషంగా ఉన్నాడు. తన సుదీర్ఘ ఫుట్‌బాల్ (Football) కెరీర్‌లో ఒక్క అంతర్జాతీయ కప్ కూడా గెలవని చెత్త రికార్డు అతడి పేరుతో ఉన్నది. అయితే ఈ ఏడాది కోపా అమెరికా కప్‌ను అర్జెంటీనాకు తెచ్చి పెట్టి ఆ చెత్త రికార్డును తుడిచిపెట్టేశాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్ ఆడుతున్న దిగ్గజాలలో క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. దేశాలకు అతీతంగా వాళ్లకు అభిమానులు ఉన్నారు. కానీ రొనాల్డోతో పోల్చితే అంతర్జాతీయ కప్ అతడికి ఎప్పుడూ లోటుగానే ఉండేది. కానీ మెస్సీ ఈ ఏడాది ఆ లోటును తీర్చేసుకున్నాడు. బార్సిలోనా క్లబ్ తరపున సుదీర్ఘ కాలంగా మ్యాచ్‌లు ఆడుతున్న లియోనల్ మెస్సీ కాంట్రాక్టు కోపా అమెరికా కప్‌కు ముందే ముగిసి పోయింది. బార్సిలోనా (Barcelona FC) కూడా అతడి కాంట్రాక్టు పొడిగింపుపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అదే సమయంలో మాంచెస్టర్ సిటీ అతడిని తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మెస్సీ కూడా మాన్ సిటీతో జత కట్టడానికి రెడీగా ఉన్నట్లు పలువురు క్రీడా విశ్లేషకులు వెల్లడించారు. కానీ కోపా అమెరికా కప్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా సమీకరణలు అన్నీ మారిపోయాయి. మెస్సీని తమ క్లబ్‌లోనే కొనసాగించేందుకు ఎఫ్‌సీ బార్సిలోనా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    ఈ క్రమంలో లియోనల్ మెస్సీ తన కుటుంబంతో కలసి బార్సిలోనాలో కనపడటం ఈ వార్తలకు బలం చేకూరింది. కోపా అమెరికా కప్ తర్వాత అమెరికాలో సరదాగా సెలవులు గడిపిన మెస్సీ.. హఠాత్తుగా బార్సిలోనాలో ప్రత్యక్షమయ్యాడు. తన కుటుంబంతో పాటు బార్సిలోనాకు రావడంతో మరో సారి కాంట్రాక్టు పునరుద్దరించుకుంటున్నాడు అని అభిమానులు సంబర పడుతున్నారు. అతడు ఫ్యామిలీతో కలసి బార్సిలోనా అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్ ఎక్కుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. అతడు జట్టుతో కలవడానికి బార్సిలోనా రాలేదని.. కేవలం కొంత కాలం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మాత్రమే వచ్చాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మెస్సీ బార్సిలోనాలో దిగిన రోజునే జట్టు మొత్తం ప్రీ సీజన్ ట్రైనింగ్ క్యాంప్‌కు జర్మనీ వెళ్లింది. మెస్సీ ఇప్పుడు కాంట్రాక్టులో లేడు కాబట్టి ఆ ట్రైనింగ్‌కు వెళ్లలేదు. కానీ అదే సమయంలో అర్జెంటీనాకు చెందిన సెర్జియో అగారో , బ్రెజిల్‌కు చెందిన ఎమర్సన్ రాయల్ కూడా జట్టుతో కలవ లేదు. వాళ్లు ప్రస్తుతం సెలవుల్లో ఉన్నట్లు తెలుస్తున్నది. అగస్టు 2 తర్వాత ఆ ఇద్దరూ బార్సిలోనా జట్టుతో కలిసే అవకాశం ఉన్నది.







    అగస్టు 2 లోపే లియోనల్ మెస్సీతో కూడా కొత్త కాంట్రాక్టును ఎఫ్‌సీ బార్సిలోనా సైన్ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కొత్త డీల్ పూర్తయ్యే వరకు మెస్సీ కూడా ట్రైనింగ్ సెషన్‌కు హాజరు కాకపోవచ్చు. ప్రస్తుతం మెస్సీ ఏజెంట్ల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అగస్టు మొదటి వారంలోపే పూర్తి డీల్ ముగిసే అవకాశం ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published: