''130 కోట్ల మంది జనాభాకు 7 పతకాలా?'' అంటూ వెటకారం.. పుల్లెల గోపీచంద్ దిమ్మతిరిగిపోయే సమాధానం

భారత్ పతకాలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన గోపీచంద్ (PC: Twitter/ANI)

భారత అథ్లెట్లు 7 పతకాలు తెచ్చిన సంబరంలో దేశం మునిగి పోయి ఉంటే.. మరోవైపు 130 కోట్ల జనాభా ఉన్న దేశం కేవలం 7 పతకాలా తెచ్చేది అని ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై మాజీ దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఘాటైన సమాధానం ఇచ్చారు.

 • Share this:
  టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) భారత అథ్లెట్లు (Indian Athletes) అత్యుత్తమ ప్రదర్శన చేశారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 6 పతకాలు గెలుచుకున్న తర్వాత భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధికంగా 7 పతకాలు సాధించారు. ఇందులో ఒక స్వర్ణ పతకం కూడా ఉన్నది. భారత అథ్లెట్లు సాధించిన ఈ విజయాలపై దేశమంతా హర్షం వ్యక్తి చేస్తున్నది. పతకాలు సాధించిన క్రీడాకారులపై ప్రశంసలు జల్లులు కురిపిస్తున్నది. కానీ అదే సమయంలో కొంత మంది ఇతర దేశాలతో పోలుస్తూ భారత్ సాధించిన పతకాలను చిన్నబోయేలా చేస్తున్నారు. పతకాల పట్టికలో భారత్ 48వ స్థానంలో నిలిచింది. అయితే ఇండియా కంటే చాలా చిన్న దేశాలైన బహామస్, ఖతర్, ఉగాండ, కొసావో వంటివి కూడా రెండేసి స్వర్ణాలు సాధించాయి. ఉక్రెయిన్ అయితే ఒక స్వర్ణ పతకం సహా 19 పతకాలు సాధించింది. దీంతో 130 కోట్ల జనాభా ఉన్న దేశం తీసుకొచ్చేది 7 పతకాలేనా అంటూ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతున్నది. ఇదే విషయాన్ని ఒక మీడియా సంస్థ దిగ్గజ బ్యాడ్మింటన్ (Badminton) ప్లేయర్ పుల్లెల గోపీచంద్ (Pullela gopichand) వద్ద ప్రస్తావించింది. దానికి ఆయన దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారు.

  పుల్లెల గోపీచంద్ ఆ ప్రశ్నకు ఏమని స్పందించారంటే...'ఏదైనా ఒలింపిక్స్‌లో మనకు పతకం లభిస్తే ఆ క్రీడల వైపు ప్రజలు ఆకర్షితులవుతుంటారు. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత చాలా మంది షూటింగ్ పట్ల ఆకర్షితులయ్యారు. 2008 బీజింగ్‌లో అభినవ్ బింద్ర స్వర్ణం సాధించగా.. 2012లో మనకు షూటింగ్‌లో రెండు పతకాలు వచ్చాయి. దీంతో అందరూ షూటింగ్ వైపు మళ్లారు. అయితే షూటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే నెలకు రూ. 2 లక్షలు ఖర్చు చేయాలి. అది మన దేశంలో సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు. అదనే కాదు.. ఒక అథ్లెట్‌ను తయారు చేయాలంటే ఏడాదికి రూ. 8 లక్షలు ఖర్చు చేయాలి. సదరు అథ్లెట్ డైట్, క్రీడా సామాగ్రి, వసతి తదితర ఖర్చులు ఇవన్నీ. ఒలింపిక్స్‌కు ఏడాదో లేక రెండేళ్ల ముందో ఖర్చు కాదు ఇది. చిన్నప్పటి నుంచి ఆ క్రీడాకారుడిపై కనీసం అంత పెట్టాలి. మరి మన దేశంలో ఎంత మంది ఒక క్రీడాకారుడిపై రూ. 8 లక్షలు ఖర్చు చేసే స్థోమత ఉన్నది? మరోవైపు మన దేశంలో సరైన పోషకాహారం లభించని వాళ్లే 70 నుంచి 80 శాతం మంది ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముందు అలాంటి వారికి పోషకాహారం ముఖ్యం. వాళ్లు ఇక క్రీడలు ఎలా ఆడతారు. మిగిలిన 20 నుంచి 30 శాతం మందిలో పోషకాహరం అందినా.. క్రీడల్లో రాణించగలిగే సత్తా ఎంత మందికి ఉంటుంది? ఇలా లెక్కలు వేస్తే.. మన దేశంలో అన్ని రకాల సదుపాయాలు ఉండి. మంచి ఆహారం లభించి.. ఫిట్‌నెస్ కలిగి ఉండే పిల్లలు, యువకుల సంఖ్య 10 కోట్లకు కూడా మించదు. ఈ 10 కోట్ల మందిలో అంతర్జాతీయ స్థాయి వరకు చేరుకోగలిగే వారిని వేళ్ల మీద లెక్కపెట్ట వచ్చు. ఇక 130 కోట్ల మందికి 7 పతకాలా అనడం ఎంత హాస్యాస్పదమో ఆలోచించండి' అని గోపీ చంద్ అన్నారు.

  Cricket: ఒలింపిక్స్‌లోకి క్రికెట్ వచ్చేస్తోంది.. శుభవార్త చెప్పిన బీసీసీఐ కార్యదర్శి జై షా
   ప్రస్తుత ప్రభుత్వం క్రీడా రంగాన్ని బాగానే ప్రోత్సమిస్తున్నది. మన దేశంలో రెజ్లర్లు, బాక్సర్లు, అథ్లెట్లు ఎక్కువ సంఖ్యలో పుట్టుకొని వస్తున్నారు. దానికి గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహమే కారణం. హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులు వస్తున్నారు. అయితే ప్రతీ రాష్ట్రంలో క్రీడా పాలసీ వేర్వేరుగా ఉంటుండటంతో అందరికీ సమాన అవకాశాలు రావడం లేదు. కేంద్రం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏకీకృత సమగ్ర క్రీడా వ్యవస్థను కనుక రూపొందిస్తే మన దేశం మరిన్ని మెడల్స్ కొడుతుందనడంలో అతిశయోక్తి లేదని గోపీచంద్ అభిప్రాయపడ్డారు.
  Published by:John Naveen Kora
  First published: