Home /News /sports /

L BALAJI WANTS TO FOLLOW HANUMA VIHARI BALAJI DECIDED TO HELP COVID PATIENTS FROM QUARANTINE JNK

Covid Help : హనుమ విహారి స్పూర్తితో.. కోవిడ్ పేషెంట్లకు క్వారంటైన్‌ నుంచే హెల్ప్.. బాలాజీ వినూత్న ఆలోచన

క్వారంటైన్ నుంచే కరోనా బాధితుల సేవకు బాలాజీ సిద్దం

క్వారంటైన్ నుంచే కరోనా బాధితుల సేవకు బాలాజీ సిద్దం

కోవిడ్ బారిన పడి ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ.. అక్కడి నుంచే కోవిడ్ బాధితులకు హెల్ప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు స్పూర్తి హనుమ విహారి అని చెప్పాడు.

    టీమ్ ఇండియా (Team India) క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) కరోనా కష్టకాలంలో కోవిడ్ బాధితులను (Covid Patients) ఆదుకోవడానికి మంచి మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉంటూ కౌంటీ క్రికెట్ ఆడుతున్న విహారి కరోనా బాధితుల సేవలో కూడా నిమగ్నమయ్యాడు. హైదరాబాద్‌తో పాటు కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో 100 మంది వలంటీర్లను విహారి నియమించుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి ఎప్పటికప్పుడు వలంటీర్లకు సూచనలు అందిస్తూ కోవిడ్ బాధితులకు సహాయపడుతున్నాడు. సిలిండర్లు, ఆసుపత్రిలో బెడ్లు, ఔషధాలు ఎప్పటికప్పుడు సమకూరుస్తున్నాడు. అంతే కాకుండా ప్రభుత్వ అధికారులతో కూడా టచ్‌లో ఉంటూ రోగులకు అవసరమైన వాటిని సమకూరుస్తున్నాడు. కరోనా కాలంలో తన చుట్టూ ఉన్న వారికి చేతనైన సాయం చేయడం తన కర్తవ్యమని విహారి అంటున్నాడు. హనుమ విహారి చేస్తున్న ఈ హెల్ఫ్‌ను చాలా మంది అభినందిస్తున్నారు. ఇప్పుడు విహారీని ఆదర్శంగా తీసుకున్న టీమ్ ఇండియా మాజీ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ (L Balaji) కూడా ఫాలో అవుతున్నాడు.

    ఐపీఎల్ 2021 కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ మైక్ హస్సీతో పాటు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కూడా కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం బాలాజీ కోవిడ్ నుంచి కోలుకోవడానికి క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్‌లో ఖాళీగా ఉండకుండా.. తాను కూడా విహారీ లాగ కోవిడ్ రోగులకు సహాయం చేయాలని బాలాజీ డిసైడ్ అయ్యాడు. 'విహారి ఒక వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా పలు ప్రాంతాల్లో కోవిడ్ సహాయం చేస్తున్నట్లు తెలుసుకున్నాను. దాదాపు 100 మందితో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అతడు సాయం చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా అదే బాటలో వెళ్లాలని అనుకుంటున్నాను. కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా.. అవసరమైన వాళ్లకు మనోధైర్యాన్ని ఇచ్చేలా కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టాలని అనుకుంటున్నాను. నేను క్వారంటైన్‌లో ఉన్నా నా వంతు సాయంగా నాకు తెలిసిన స్వచ్చంద సేవా సంస్థల ద్వారా సాయం చేయాలని భావిస్తున్నాను' అని లక్ష్మీపతి బాలాజీ అన్నారు.





    నేను ప్రస్తుతం నెగెటివ్ రిపోర్టు కోసం వెయిట్ చేస్తూ క్వారంటైన్‌లో ఉంటున్నాను. అందరూ నా లాగా అదృష్టవంతులు ఉండరు. చాలా మంది కరోనా కారణంగా కష్టాలు పడుతున్నారు. కాబట్టి నాకున్న వనరులను ఉపయోగించి చేతనైన సహాయం చేయాలని భావిస్తున్నానని బాలాజీ ఒక జాతీయ దినపత్రికతో అన్నారు.
    Published by:John Naveen Kora
    First published:

    Tags: Chennai Super Kings, Covid-19, Cricket, Hanuma vihari, IPL 2021

    తదుపరి వార్తలు