హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2021 : కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ కోచ్‌‌కు బెట్టింగ్ మాఫియాతో సంబంధాలు.. 8 ఏళ్ల నిషేధం విధించిన ఐసీసీ

IPL 2021 : కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ కోచ్‌‌కు బెట్టింగ్ మాఫియాతో సంబంధాలు.. 8 ఏళ్ల నిషేధం విధించిన ఐసీసీ

హీత్‌స్ట్రీక్‌పై 8 ఏళ్ల నిషేధాన్ని విదించిన ఐసీసీ [PC: iplt20.com]

హీత్‌స్ట్రీక్‌పై 8 ఏళ్ల నిషేధాన్ని విదించిన ఐసీసీ [PC: iplt20.com]

ఐపీఎల్ (IPL 2021) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) మాజీ కోచ్, జింబాబ్వే (Zimbabwe) జాతీయ జట్టు మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్‌పై (Heath Streak) ఐసీసీ (ICC) 8 ఏళ్ల నిషేధాన్ని విధించింది. 28 మార్చి 2029 వరకు క్రికెట్‌కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఐసీసీ ఆదేశించింది. హీత్ స్ట్రీక్‌పై ఉన్న 5 ఆరోపణలను ఆయన ఐసీసీ ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ముందు అంగీకరించడంతో ఎనిమిదేళ్ల నిషేధంతో వదిలేసింది. 47 ఏడేళ్ల హీత్ స్ట్రీక్ క్రికెట్ కెరీర్ నుంచి రిటైర్ అయ్యాక 2016 నుంచి 2018 మధ్య పలు ఫ్రాంచైజీలకు కోచ్‌గా పని చేశారు. ఐపీఎల్ 2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా, అదే ఏడాది ఆఫ్గనిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో కాబుల్ జ్వానన్ ఫ్రాంచైజీకి కోచ్‌గా పని చేశారు. అయితే 2018లో జింబాబ్వే, బంగ్లాదేశ్, శ్రీలంక మూడు దేశాల సిరీస్, 2018 జింబాబ్వే-ఆఫ్గనిస్తాన్ సిరీస్, 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్, 2018 ఆఫ్గనిస్తాన్ ప్రీమియర్ లీగ్ సమయంలో జట్టుకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బయటకు చేరవేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వివరాలను బెట్టింగ్ మాఫియా తమ అవసరాల కోసం ఉపయోగించినట్లు ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ గుర్తించింది. అంతే కాకుండా ఒక జాతీయ జట్టు కెప్టెన్, నలుగురు క్రికెటర్లను బెట్టింగ్ మాఫియా ప్రతినిధులకు పరిచయం చేయడానికి ప్రయత్నించినట్లు కూడా సమాచారం.

2017 సెప్టెంబర్‌లో హీత్ స్ట్రీక్‌ను భారత్‌కు చెందిన ఒక వ్యక్తితో సుదీర్ఘంగా వాట్సప్ సంభాషణ కొనసాగించాడు. వీరిద్దరూ చాటింగ్ రూపంలో దాదాపు 15 నెలల పాటు టచ్‌లో ఉన్నారు. 'తాను జింబాబ్వేలో ఒక టీ20 లీగ్ నిర్వహించడానికి ఆసక్తిగా ఉన్నాను' అని సదరు వ్యక్తి స్ట్రీక్‌తో పరిచయం చేసుకున్నట్లు ఐసీసీ గుర్తించింది. ఆ తర్వాత ఆ వ్యక్తి బెట్టింగ్ లింక్స్‌ను బయట పెట్టాడు. స్ట్రీక్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌ను కూడా ఆ వ్యక్తి తీసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ ప్రకారం బయటి వ్యక్తులు క్రికెటర్లు, కోచ్‌లను సంప్రదిస్తే వెంటనే ఆ విషయాన్ని ఏసీయూకి తెలియజేయాలి. కానీ స్ట్రీక్ కావాలనే తన సంబంధాలను దాచి పెట్టాడని ఐసీసీ చెబుతున్నది.


ఇక ఇతరుల నుంచి ఎలాంటి బహుమతులు, డబ్బు అందినా వెంటనే సమాచారం ఇవ్వాలి. కానీ హీత్ స్ట్రీక్‌కు రెండు బిట్ కాయిన్స్ (35 వేల డాలర్ల విలువ)తో పాటు అతని భార్యకు ఒక ఐఫోన్‌ను సదరు భారత వ్యక్తి అందించాడు. ఆ సమయంలో హీత్ స్ట్రీక్ ఐపీఎల్, పీఎస్ఎల్, ఏపీఎల్, బీపీఎల్‌లలో పలు ఫ్రాంచైజీలకు కోచ్‌గా పని చేశాడు. ఇక ఐసీసీ విచారణకు ముందు హీత్ స్ట్రీక్ తన వాట్సప్ సందేశాలను, అనుమానిత కాంటాక్ట్ నెంబర్లను డిలీట్ చేసినట్లు యాంటీ కరప్షన్ యూనిట్ గుర్తించింది.

'హీత్ స్ట్రీక్ మాజీ అంతర్జాతీయ క్రికెటర్‌గా, జాతీయ జట్టు కోచ్‌గా ఎంతో అనుభవం కలిగి ఉన్నాడు. తన కెరీర్‌లో ఎన్నో అవినీతి నిరోధక పాఠాలను తన విద్యార్థులకు, క్రికెటర్లకు చెప్పాడు. కానీ స్వయంగా తానే కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాడు. తాను ఆ ఊబిలో కూరుకొని పోవడమే కాకుండా ఒక కెప్టెన్, మరో నలుగురు క్రికెటర్లను అందులో దింపడానికి ప్రయత్నించాడు' అని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ వెల్లడించాడు.

First published:

Tags: Cricket, ICC, IPL 2021, Kolkata Knight Riders

ఉత్తమ కథలు