ఐపీఎల్ 2021లో (IPL 2021) ఇప్పటి వరకు టాప్ స్కోరర్‌గా ఉన్న కేఎల్ రాహుల్ (KL Rahul).. తన జట్టు పంజాబ్ కింగ్స్‌ను (Punjab Kings) మాత్రం ప్లే ఆఫ్స్‌కు (Playoffs) తీసుకొని వెళ్లలేక పోయాడు. ఈ ఏడాది కూడా పంజాబ్ కింగ్స్ 6వ స్థానంతో సరిపెట్టుకున్నది. కేఎల్ రాహుల్ ఇక ఐపీఎల్ 2022లో జట్టు వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. క్రీడా వెబ్సైట్ 'క్రిక్‌బజ్' కథనం మేరకు.. కేఎల్ రాహుల్ ఇకపై పంజాబ్ కింగ్స్ జట్టులో కనిపించడు. తాను ఫ్రాంచైజీని వీడనున్నట్లు ఇప్పటికే యాజమాన్యానికి కూడా సమాచారం అందించినట్లు సదరు కథనంలో పేర్కొన్నారు. ఐపీఎల్ 2022లో కొత్తగా రెండు జట్లు రానున్నాయి. ఈ నెల 25న బీసీసీఐ (BCCI) కొత్త జట్లను (New Teams) ప్రకటించబోతున్నది. వచ్చే సీజన్ నుంచి మొత్తం 10 జట్లు లీగ్‌లో పాల్గొననున్నాయి. అంతకు ముందే మెగా వేలం నిర్వహించబోతున్నారు. ఈ సారి కేవలం ఇద్దరు లేద ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం బీసీసీఐ కల్పిస్తున్నది. దీంతో ఆయా ఫ్రాంచైజీలు ఎవరెవరిని జట్టుతో పాటు ఉంచుకోవాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఐపీఎల్ 2022లో తాను జట్టుతో ఉండబోనని.. తనను రిటైన్ చేసుకోవద్దని కేఎల్ రాహుల్ కోరినట్లు తెలుస్తున్నది. కేఎల్ రాహుల్ అభ్యర్థనకు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించింది. ఇప్పటి పలు ఫ్రాంచైజీలు కేఎల్ రాహుల్‌ను తీసుకోవడానికి సంప్రదించినట్లు సమాచారం. అహ్మదాబాద్, లక్నో కేంద్రాలుగానే కొత్త జట్లు రానున్నాయి. వాటిలో ఏదైనా ఒక జట్టుకు రాహుల్ వెళ్లే అవకాశాలను కూడా కొట్టి పారేయలేము. అయితే ఏ జట్టు తరపున వెళ్లినా కెప్టెన్‌గా ఉండటానికికే తాను ప్రాథాన్యత ఇస్తానని చెప్పినట్లు సమాచారం.
కేఎల్ రాహుల్ 2018 నుంచి పంజాబ్ కింగ్స్ తరపున ఓపెనింగ్ బ్యాటర్‌గా ఉన్నాడు. మయాంక్ అగర్వాల్తోకలసి ఎన్నో మ్యాచ్‌లలో రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 2019 తర్వాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ జట్టును వదలి వెళ్లిపోవడంతో.. ఆ బాధ్యతలు కేఎల్ రాహుల్ తీసుకున్నాడు. అయితే అతడు కెప్టెన్‌గా ఉన్న 2020, 2021 సీజన్లో పంజాబ్ కింగ్స్ 6వ స్థానంతోనే సరిపెట్టుకున్నది. కెప్టెన్‌గా రాహుల్ విఫలమైనా బ్యాటర్‌గా మాత్రం అద్బుతంగా రాణించాడు. పంజాబ్ కింగ్స్ తరపున మొత్తం 55 మ్యాచ్‌లు ఆడి 56.62 సగటు 139.76 స్ట్రైక్ రేట్‌తో 2548 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 23 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో అతడి అత్యధిక పరుగులు 132. ఇక ఈ మెగా లీగ్‌లో పంజాబ్ కింగ్స్ తరపున 221 ఫోర్లు, 110 సిక్సులు బాదాడు.
రాహుల్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్ కోసం పలు జట్లు ఎదురు చూస్తున్నాయి. కానీ రాహుల్ కొత్త జట్లలో ఏదో ఒక దాని తరపున ఆడటానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. అన్నీ అనుకూలిస్తే కేఎల్ రాహుల్‌ను తీసుకోవడానికి అదానీ గ్రూప్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమవుతాయో తెలియాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, IPL 2021, KL Rahul, Punjab kings