టీమిండియా (Team India)లో కెప్టెన్సీ వ్యవహారం కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా ఉంది. టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కొహ్లీ (Virat Kohli) తప్పుకున్న తర్వాత.. వన్డేల నుంచి బీసీసీఐ తప్పించింది. ఆ నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నారని ఆరోపిస్తూ.. టెస్ట్ కెప్టెన్సీకి కూడా కొహ్లీ గుడ్‌బై చెప్పేశాడు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా టూర్లో టీమిండియా వన్డే జట్టు కేఎల్ రాహుల్ సారథిగా వహించాడు. ఐతే ఆ టోర్నీలో భారత్ అట్టర్ ఫ్లాపయింది . ఒక్కమ్యాచ్ కూడా గెలవకుండా వైట్ వాష్ అయింది. వన్డే సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. సునీల్ గవాస్కర్‌తో పాటు పలువురు ప్రముఖులు సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టారు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు, పశ్చిమ బెంగాల్ క్రీడల మంత్రి మనోజ్ తివారి (Manoj Tiwary) కూడా మండిపడ్డారు.
అసలు కేఎల్ రాహుల్‌లో ఏ లక్షణాలు చూసి అతడిని టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేశారని సెలెక్టర్లపై విరుచుకుపడ్డారు మనోజ్ తివారి. స్పోర్ట్స్‌కీడాతో ముచ్చటించిన ఆయన.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వ్యవహారంపైనా మాట్లాడారు. నాయకుడిని తయారు చేయడం కాదని, అతడిలో సహజంగానే ఆ లక్షణాలు ఉండాలంటూ చురకలంటించారు. సెలక్టర్ల తీరు సరిగా లేదని ఆయన విమర్శించారు.
‘‘అసలు రాహుల్‌లో కెప్టెన్సీ మెటీరియల్ మీకేం కనిపించింది? భారత భావి కెప్టెన్‌ను తయారు చేస్తున్నామని అంటారు. కానీ కెప్టెన్సీ సహజసిద్ధంగా అలవడాలి. వాళ్లు చెప్పినట్లుగా కెప్టెన్‌ని తయారు చేయడం సాధ్యమే. కానీ... ఆ ప్రక్రియ అంత సులభమేమీ కాదు. చాలా సమయం పడుతుంది. కనీసం 20 నుంచి 25 మ్యాచ్‌లు ఆడిన తర్వాతే, స్వతహాగా నిర్ణయాలు తీసుకునే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు కూడా కెప్టెన్‌గా విజయం సాధిస్తారన్న గ్యారెంటీ లేదు. ఇండియాకు ప్రతి అంతర్జాతీయ ముఖ్యమే. అలాంటపుడు ఇలాంటి రిస్క్ ఎందుకు?’’ అని మనోజ్ ప్రశ్నించారు.
టీమిండియాకు మంచి ఆటగాళ్లు ఉన్నారని..ఐనప్పటికీ వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయామని మనోజ్ తివారి అసంతృప్తి వ్యక్తం చేశారు. సెలక్టర్ల తప్పుడు నిర్ణయాల వల్లే ఇంతటి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని... వారి తీరు నిరాశ పరిచిందనిశ విమర్శించారు. కెప్టెన్‌గా రాహుల్ నిరూపించుకున్నదేంలేదు.. అతడిలో ఏ లక్షణాలు చూసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారో అర్థం అస్సలు కావడం లేదుని ఆయన పేర్కొన్నారు.
కాగా, వచ్చే నెలలో విండీస్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ వన్డే , టీ20 సిరీస్‌లు ఫిబ్రవరి 6న ప్రారంభమై ఫిబ్రవరి 20తో ముగుస్తాయి. ఫిబ్రవరి 6న తొలివన్డే, 9న రెండో వన్డే, 11న మూడో వన్డే జరుగనుంది. ఇక ఫిబ్రవరి 16న తొలి టీ20, 17న రెండో టీ20, 20న మూడో టీ20 నిర్వహిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.