Khelo India 2023 : ఏదైనా క్రీడ (Sports)లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలంటే అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా మారుమూల పల్లెల్లోని వారికి భారత్ (India) తరఫున అంతర్జాతీయ వేదికల్లో పోటీ పడే అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. ఒలింపిక్స్ (Olympics) లాంటి ఈవెంట్స్ కు అర్హత సాధించాలంటే ఇంకా కష్టం. అత్యాధునిక ట్రయినింగ్ తో పాటు సరైన కోచింగ్ ఉన్న కొందరు మాత్రమే ఒలింపిక్స్ లాంటి ఈవెంట్స్ లో ఆడే అవకాశం దక్కుతుంది. కోచింగ్, ట్రయినింగ్ వంటి అంశాలు చాలా ఖర్చుతో ముడిపడి ఉండేవి. దాంతో ప్రతిభ ఉన్నా చాలా మంది వెలుగులోకి రావడం లేదు. అయితే ఐదేళ్ల కిందట అంటే 2018లో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఐదేళ్లలో మంచి సక్సెస్ సాధించింది.
ఖేలో ఇండియాగా ఆరంభమైన ఈ ప్రోగ్రామ్.. ఇప్పుడు ఖేలో యూత్ గేమ్స్ గా రూపాంతరం చెందింది. 17 ఏళ్లలోపు బాలబాలికల మధ్య వివిధ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించి అందులో ప్రతిభ కనబర్చిన వారిని వెలుగులోకి తీసుకురావడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈ గేమ్స్ లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాకుండా.. వారికి స్కాలర్ షిప్ లను కూడా ఇస్తారు. ఈ రకంగా చిన్న వయసు నుంచే ఒలింపిక్స్ లాంటి మెగా గేమ్స్ కు ప్రిపేర్ చేస్తారు.
ఖేలో ఇండియా టు ఒలింపిక్స్‌ఇండియా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధికంగా 7 పతకాలు గెలిచింది. ఇదే ఓ అద్భుతం అనుకుంటే.. ఈ ఒలింపిక్స్‌కు వెళ్లిన వారిలో ఖేలో ఇండియాలో పాల్గొన్న అథ్లెట్లు కూడా ఉండటం మరో విశేషం. షూటర్ మను బాకర్, సౌరబ్ చౌదరి, అన్షు మాలిక్, శ్రీహరి నటరాజ్ వంటి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లు ఈ ఖేలో ఇండియా ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లే. వీళ్లు మెడల్స్ గెలవకపోయినా.. ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికపై తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం దక్కింది. భవిష్యత్తులో విజయాలు సాధించడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించింది.
మధ్యప్రదేశ్ వేదికగా 2023 ఖేలో ఇండియా గేమ్స్
మధ్యప్రదేశ్ వేదికగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఐదో ఎడిషన్ జరగనున్నాయి. రాజధాని భోపాల్ లో ఈ పోటీలు జరగనున్నాయి. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. మొత్తం 23 ఈవెంట్స్ లో 6 వేల మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhopal, Games, India, Khelo India Youth Games, Madhya pradesh, Sports