Khelo India 2023 : ఏదైనా క్రీడలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలంటే అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా మారుమూల పల్లెల్లోని వారికి భారత్ (India) తరఫున అంతర్జాతీయ (International) వేదికల్లో పోటీ పడే అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. ఒలింపిక్స్ (Olympics) లాంటి ఈవెంట్స్ కు అర్హత సాధించాలంటే ఇంకా కష్టం. అత్యాధునిక ట్రయినింగ్ తో పాటు సరైన కోచింగ్ ఉన్న కొందరు మాత్రమే ఒలింపిక్స్ లాంటి ఈవెంట్స్ లో ఆడే అవకాశం దక్కుతుంది. కోచింగ్, ట్రయినింగ్ వంటి అంశాలు చాలా ఖర్చుతో ముడిపడి ఉండేవి. దాంతో చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను స్పోర్ట్స్ ను కెరీర్ గా ఎంచుకునేందుకు ఇష్టపడరు. దాంతో ప్రతిభ ఉన్నా చాలా మంది వెలుగులోకి రావడం లేదు.
అయితే ఐదేళ్ల కిందట అంటే 2018లో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఐదేళ్లలో మంచి సక్సెస్ సాధించింది. ఖేలో ఇండియాగా ఆరంభమైన ఈ ప్రోగ్రామ్.. ఇప్పుడు ఖేలో యూత్ గేమ్స్ గా రూపాంతరం చెందింది. ఈ గేమ్స్ లో ఆడి తమ ప్రతిభను నిరూపించుకున్న బాలబాలికలకు ఏటా రూ. 5 లక్షల నుంచి రూ. 6.28 లక్షలను స్కాలర్ షిప్ రూపంలో కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. అత్యాధునిక వసతులతో శిక్షణను ఇస్తూ తీర్చిదిద్దుతుంది.
ఇందులో పాల్గొనడం ఎలా?
దేశంలోని భారత పౌరడైన ప్రతి బాలబాలికలు ఇందులో పాల్గొనేందుకు అర్హులు. అయితే 17 ఏళ్లలోపు ఉండాలి. ఖేలో ఇండయా యూత్ గేమ్స్ అనేవి స్కూల్ లెవల్స్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలు. ఇందులో పాల్గొనాలి అంటే 15 నుంచి 17 ఏళ్లలోపు బాలబాలికలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖేలో ఇండియా వెబ్ సైట్ లోకి వెళ్లి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో స్పోర్ట్స్ లో తాము సాధించిన సర్టిఫికేట్ లను కూడా అప్ లోడ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీకు దగ్గరలోని ఖేలో ఇండియా సెంటర్స్ వివరాలను కూడా తెలుసుకునే వీలుంటుంది. ఖేలో ఇండియా రిజిస్ట్రేషన్ లింక్ కోసం క్లిక్ చేయండి
2018 నుంచి ప్రతి ఏటా ఈ గేమ్స్ జరుగుతున్నాయి. కరోనా కారణంగా 2021లో జరగాల్సిన గేమ్స్ 2022లో జరిగాయి. ఇక ఈ ఏడాది మధ్యప్రదేశ్ వేదికగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఐదో ఎడిషన్ జరగనున్నాయి. రాజధాని భోపాల్ లో ఈ పోటీలు జరగనున్నాయి. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. మొత్తం 23 ఈవెంట్స్ లో 6 వేల మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు.
ఖేలో ఇండియా ఆర్థిక సాయం
ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తుండటంతో ప్రభుత్వం కూడా ఖేలో ఇండియాకు కేటాయించే నిధులు పెరుగుతూ వచ్చాయి. తొలి ఏడాది ఈ కార్యక్రమం కోసం రూ. 324 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాతి ఏడాది రూ. 500 కోట్లు, గతేడాది రూ. 890 కోట్లు కేటాయించారు. ఈ ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా కొన్ని ఎంపిక చేసిన స్పోర్ట్స్‌లో అద్భుతమైన నైపుణ్యం కనబరిచిన అథ్లెట్లకు 8 ఏళ్లపాటు ఏడాదికి రూ. 5 లక్షలు స్కాలర్ షిప్ గా ఇస్తారు. యువ అథ్లెట్లకు అత్యాధునిక శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ సహా కర్ణాటక , అరుణాచల్‌ప్రదేశ్, కేరళ , మణిపూర్, మిజోరం, ఒడిశా , నాగాలాండ్ వంటి 8 రాష్ట్రాల్లో ఎక్సెలెన్స్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది. దేశంలో స్పోర్ట్స్ వైపు యువతను ఆకర్షించడానికి ఈ ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ఉపయోగపడిందనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Games, Khelo India Youth Games, Madhya pradesh, School Games, Sports