Khelo India 2023 : భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా (Khelo India)’ కార్యక్రమంపై యువ సైక్లిస్ట్ డేవిడ్ బెక్‌హాం (David Beckham) (19) కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తీసుకొచ్చిన ఈ బృహత్కర కార్యక్రమాన్ని డేవిడ్ కొనియాడాడు. ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొనడం వల్లే అంతర్జాతీయ స్థాయికి చేరుకోగలిగానని ఈ ఛాంపియన్ వెల్లడించాడు. గతేడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఇండియన్ టీమ్‌కు డేవిడ్ బెక్‌హాం ప్రాతినిథ్యం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నెలాఖరున మళ్లీ ఖేలో ఇండియా యువజన పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’(Sports Authority Of India) నిర్వహించిన కార్యక్రమంలో డేవిడ్ కొన్ని విషయాలను పంచుకొన్నాడు.
ఇలా వెలుగులోకి
2020లో అస్సాం రాజధాని గువాహటిలో ‘ఖేలో ఇండియా’ మూడో ఎడిషన్ పోటీలు జరిగాయి. అండమాన్ నికోబార్ దీవులకు చెందిన డేవిడ్ బెక్‌హాం అండర్ 17 విభాగంలో సైక్లింగ్ పోటీల కోసం గుహవాటికి వచ్చాడు. ఇందులో ఎవరూ ఊహించని విధంగా ప్రదర్శన చేసి అనేక బంగారు పతకాలు గెల్చుకున్నాడు. దీంతో ఒక్కసారిగా డేవిడ్ వెలుగులోకి వచ్చాడు. అయితే, ఖేలో ఇండియా తన కెరీర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందని డేవిడ్ బెక్‌హాం వెల్లడించాడు. పోటీలకు హాజరు కావడంతో తన కెరీర్ మలుపు తిరిగిందని చెప్పుకొచ్చాడు. ఈ పోటీల్లో తన బెస్ట్ ఇచ్చానని.. అందువల్లే నేషనల్ రికార్డును నమోదు చేయగలిగానని డేవిడ్ వివరించాడు. ఈ పోటీల అనంతరం జర్మనీలో జరిగిన నేషన్ కప్ పోటీల్లో పాల్గొనడానికి వెళ్లినట్లు తెలిపాడు. జాతీయ టోర్నమెంట్లలో పాల్గొంటూ డేవిడ్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. తన పేరిట ఉన్న రికార్డులను తనే అధిగమించుకున్నాడు.
అద్భుత వేదిక
ప్రతిభ గల క్రీడాకారులకు ఖేలో ఇండియా అద్భుతమైన వేదిక అని డేవిడ్ బెక్ హాం స్పష్టం చేశాడు. అథ్లెట్లు తమ టాలెంట్‌ని చూపెట్టుకోవడానికి ‘ఖేలో ఇండియా’ మంచి అవకాశాలను కల్పిస్తోందని చెప్పాడు. ఈ పోటీల్లో పాల్గొన్నాకే నాలో ఆత్మవిశ్వాసం కలిగింది. ‘యస్.. నేను కూడా సాధించగలను. భారత సైక్లింగ్ కోసం నా వంతుగా కృషి చేయగలను’ అనే భావన కలిగిందని డేవిడ్ వెల్లడించాడు. అయితే ఈ ఏడాది జరిగే ఐదో ‘ఖేలో ఇండియా’ పోటీల్లో పాల్గొనట్లేదని డేవిడ్ ప్రకటించాడు. సీనియర్ అయినందున అండర్ 17 విభాగంలో పోటీపడట్లేదని తెలిపాడు. ప్రస్తుతం తన దృష్టంతా నేషన్ కప్‌పైనే ఉందని చెప్పుకొచ్చాడు. ఇండోనేషియా, ఈజిప్టులలో ఈ నేషన్ కప్‌లు జరగనున్నాయి. ఇప్పటికే టోర్నీల కోసం సన్నద్ధత ప్రారంభించానని దేశానికి మెడల్స్ తీసుకు రావడం కోసం శక్తినంతా ధారపోస్తానని 19 ఏళ్ల డేవిడ్ స్పష్టం చేశాడు.
ఒలింపిక్ పతకమే లక్ష్యం
భారత్‌కు ఒలింపిక్స్ మెడల్ తీసుకురావడమే తన అంతిమ లక్ష్యమని డేవిడ్ బెక్‌హాం వెల్లడించాడు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు వీలైనన్ని టోర్నీల్లో పాల్గొంటానని చెప్పాడు. గతేడాది జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు. మన భారతీయులు నిరాశ పరిచినా ప్రొఫెషనల్‌గా ఎన్నో మెలుకువలు తెలుసుకున్నట్లు బెక్‌హాం పేర్కొన్నాడు.
ఖేలో ఇండియా గేమ్స్
దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రతిభ కలిగిన ఔత్సాహిక క్రీడాకారులను వెలికితీయడమే ఖేలో ఇండియా ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ 2017-18 పీరియడ్‌లో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ పేరిట పోటీలను ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగు ఎడిషన్లు జరిగాయి. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఐదో విడత పోటీలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. కోవిడ్ కారణంగా 2021లో జరగాల్సిన నాలుగో ఎడిషన్ 2022లో నిర్వహించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhopal, Games, Khelo India Youth Games, Madya pradesh, School Games, Sports