న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరోసారి తన గొప్పదనాన్ని చాటుకున్నాడు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న ప్రత్యర్థి జట్టు ఆటగాడిని హత్తుకొని ఓదార్చాడు. హమిల్టన్ వేదికగా వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 243/2గా నిలిచింది. కివీస్ తరఫున తొలి టెస్టు ఆడిన విల్ యంగ్ 5 పరుగులకే పెవిలియన్ చేరగా.. టామ్ లాథమ్ , కేన్ విలియమ్సన్ తమ పార్టనర్ షిప్ తో న్యూజిలాండ్‌కు ఆధిపత్యం కట్టబెట్టారు. కేన్ విలియమ్సన్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో వికెట్‌కు 154 పరుగులు జోడించిన తర్వాత లాథమ్ ఔటవగా.. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రాస్ టేలర్ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
వర్షం, మైదానం చిత్తడిగా ఉండటంతో టాస్ రెండు గంటలు ఆలస్యమవ్వగా.. ఔట్ ఫీల్డ్ మీద ఉన్నట్లుగానే పిచ్ మీద కూడా పూర్తిగా పచ్చిక ఉండటం ఆశ్చర్యపరిచింది. తడి, పచ్చికతో పేసర్లకు అనుకూలిస్తోన్న పిచ్ మీద విలియమ్సన్ ఆడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. విండీస్ బౌలర్లు అతణ్ని ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. కరేబియన్ బౌలర్లు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయలేకపోవడంతో.. కష్టమైన బంతుల్ని కేన్, లాథమ్ వదిలేశారు.
ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ తన ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంతోనే మరోసారి ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన కరేబియన్ క్రికెటర్ కెమర్ రోచ్‌ను మ్యాచ్ ప్రారంభానికి ముందు విలియమ్సన్ హత్తుకొని సంఘీభావం ప్రకటించాడు. తోటి క్రికెటర్ పట్ల కివీస్ కెప్టెన్ వ్యవహరించిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో లాథమ్ వికెట్‌ను పడగొట్టిన రోచ్.. మోకాలిపై వాలిపోయి తండ్రిని గుర్తుకు తెచ్చుకొని భావోద్వేగానికి లోనయ్యాడు. రోచ్ తండ్రి మరణానికి సంతాప సూచికగా ఇరు జట్ల క్రికెటర్లు ఫస్ట్ టెస్టు తొలి రోజు నల్ల చేతి బ్యాండ్లను కట్టుకొని బరిలోకి దిగారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.