IPL 2021 : చితక్కొట్టిన రాయల్స్.. బట్లర్ సెంచరీ.. హైదరాబాద్ ముందు 221 పరుగుల భారీ టార్గెట్

సెంచరీతో కదం తొక్కిన జాస్ బట్లర్ [PC: iplt20.com]

  • Share this:
    ఐపీఎల్ 2021లో (IPL 2021) భాగంగా ఆదివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్య కీలక పోరు జరుగుతున్నది. ఈ సీజన్‌లో కెప్టెన్సీ మార్పు తర్వాత హైదరాబాద్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ జాస్ బట్లర్ (Jos Buttler) బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (17) విఫలం అయినా.. బట్లర్,. శాంసన్ రాయల్స్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. ఇన్నింగ్స్ ప్రారంభంలో జాస్ బట్లర్‌కు రెండు సార్లు లైఫ్ లభించింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అనవసరమైన రివ్యూ తీసుకోవడంతో హైదరాబాద్ రివ్యూలు కోల్పోయింది. అయితే తర్వాత ఓవర్లో బట్లర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే అంపైర్ నాటౌట్ ప్రకటించాడు. హైదరాబాద్ దగ్గర రివ్యూలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయారు. అయితే బాల్ ట్రాకింగ్‌లో అది క్లియర్ అవుట్‌గా తేలింది. అదే ఓవర్ చివరి బంతికి బట్లర్ ఇచ్చిన క్యాచ్‌ను విజయ్ శంకర్ మిస్ చేశాడు. అప్పటికి అతడి స్కోర్ 7 పరుగులు మాత్రమే. ఈ రెండు లైఫ్స్ వచ్చాక బట్లర్ ఇక ఆగలేదు. సంజూ శాంసన్‌తో కలసి సన్‌రైజర్స్ బౌలర్లపై పూర్తి దాడికి దిగాడు. సిక్సులు, బౌండరీలతో చెలరేగిన జాస్ బట్లర్ బౌలర్ ఎవరైనా తన దాడి ఆపలేదు. కేన్ విలియమ్‌సన్ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. మరో ఎండ్‌లో సంజూ శాంసన్ కూడా దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ కలసి 2వ వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యం అందించారు.

    కాగా, శంకర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (48) భారీ షాట్ కోసం ప్రయత్నించగా.. బౌండరీ వద్ద అబ్దుల్ సమద్ అద్భుతమైన క్యాచ్ చేయడంతో అవుటయ్యాడు. ఆ తర్వాత రెండు బంతులకు జాస్ బట్లర్ ఐపీఎల్‌లో తన తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 56 బంతుల్లోనే జాస్ బట్లర్ సెంచరీ చేయడం గమనార్హం. సెంచీ తర్వాత కూడా బట్లర్ భారీ షాట్లను కొనసాగించాడు. బట్లర్. 64 బంతుల్లో 11 ఫోర్లు , 8 సిక్సుల సహాయంతో 124 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. రియాన్ పరాగ్ (15), డేవిడ్ మిల్లర్ (7) చివర్లో భారీ షాట్లతో అలరించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 220 పరుగులు చేసింది.

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలవాలంటే 120 బంతుల్లో 221 పరగులు చేయాలి.

    జాస్ బట్లర్ 126

    సంజూ శాంసన్ 48

    రియాన్ పరాగ్ 14 నాటౌట్

    డేవిడ్ మిల్లర్ 7 నాటౌట్

    భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, విజయ్ శంకర్ తలా ఒక వికెట్ తీశారు.
    Published by:John Naveen Kora
    First published: