JOE ROOT ONLY BEHIND ALASTAIR COOK AMONG ENGLAND TEST CENTURIONS NOW TARGETED DON BRADMAN UNIQUE RECORD JNK
Joe Root Records: జో రూట్ రికార్డుల జోరు.. ఇండియాపై తిరుగులేని గణాంకాలు... బ్రాడ్‌మాన్ రికార్డుకు ఎసరు
రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న జో రూట్ (PC: england Cricket)
Joe Root: ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఈ ఏడాది మంచి జోరు మీద ఉన్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 6 సెంచరీలు బాదాడు. ఇండియాపై వరుసగా మూడు టెస్టు సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించాడు. ఇక ఇప్పుడు బ్రాడ్‌మాన్ రికార్డుపై కన్నేశాడు.
ఇండియా-ఇంగ్లాండ్ (India Vs England) మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో (Test Cricket) ఒక తేడా స్పష్టంగా కనిపిస్తున్నది. టీమ్ ఇండియా (Team India) కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్ అందుకోలేక సతమతం అవుతూ పరుగులు రాబట్టడానినే ఆపసోపాలుపడుతుంటే.. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (Joe Root) మాత్రం సెంచరీలు మీద సెంచరీలు బాదేస్తున్నాడు. ఈ ఏడాది జో రూట్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. 2021లో ఏకంగా 6 సెంచరీలు బాదాడు. ఇందులో 2 సెంచరీలు శ్రీలంకపై నమోదు చేయగా.. మిగిలిన 4 సెంచరీలు భారత జట్టుపైనే చేయడం విశేషం. భారత పర్యటనకు వచ్చినప్పుడు చెన్నైలో జరిగిన తొలి టెస్టులో జో రూట్ ఏకంగా 218 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో వరుసగా మూడు టెస్టుల్లో మూడు సెంచరీలు చేశాడు. నాటింగ్‌హామ్‌లో 109, లార్డ్స్‌లో 180 నాటౌట్, లీడ్స్‌లో 121 పరుగులు బాదాడు. ఓకే క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మాన్ డెనిస్ కాంప్టన్ (1947), మైఖెల్ వాన్ (2002) సరసన జో రూట్ చేరాడు. ఇక ఒకే క్యాలంటర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్లలో జో రూట్ రెండో స్థానంలో నిలిచాడు. రికీ పాంటింగ్ 7 సెంచరీలు (2006) చేయగా.. ఆ తర్వాత రికీ పాంటింగ్ (2005), గ్రేమ్ స్మిత్ (2008), స్టీవ్ స్మిత్ (2017) జో రూట్ (2021) 6 సెంచరీలు చేశారు. రూట్ తన కెరీర్‌లో మొత్తం 23 సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన అలిస్టర్ కుక్ (33 సెంచరీలు) తర్వాత స్థానంలో జో రూట్ (23), కెవిన్ పీటర్సన్ (23)లు ఉన్నారు. ఇక కెప్టెన్‌గా జో రూట్ 12 సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా అలిస్టర్ కుక్ కూడా 12 సెంచరీలు బాదాడు.
మరిన్ని రికార్డులు..
- ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1350 కంటే ఎక్కువ పరుగులు మూడు సార్లు చేసిన ఏకైక బ్యాట్స్‌మాన్‌గా జో రూట్ రికార్డులకు ఎక్కాడు.
- ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధికంగా అర్దసెంచరీలు చేసిన ఎంఎస్ ధోనీ సరసన కెప్టెన్ జో రూట్ నిలిచాడు. వీరిద్దరూ 6 అర్దసెంచరీలు బాదారు.
- ఇండియాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మాన్‌గా జో రూట్ (2247 పరుగులు) నాలుగో స్థానంలో నిలిచాడు. రికీ పాంటింగ్ 2555 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
- ఇండియాతో జరిగిన తొలి మూడు టెస్టుల్లో వరుసగా సెంచరీలు చేసిన ఏడో బ్యాట్స్‌మాన్‌గా రూట్ రికార్డులకు ఎక్కాడు.
- ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్ , వీవియన్ రిచర్డ్స్, గారీ సోబర్స్ (8 సెంచరీలు) సరసన జో రూట్ చేరాడు.
- ఇండియాతో జరిగిన మూడో టెస్టులో చేసిన సెంచరీ రూట్‌కు మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. 125 బంతుల్లో రూట్ సెంచరీ బాదాడు. అంతకుముందు ఆస్ట్రేలియాపై 118 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
- ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లలో జో రూట్ 8 సెంచరీలు చేయగా, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, అలిస్టర్ కుక్ 7 సెంచరీలు, మహ్మద్ అజారుద్దీన్, కెవిన్ పీటర్సన్ 6 సెంచరీలు చేశారు.
- ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్... డాన్ బ్రాడ్‌మాన్ ఇంగ్లాండ్‌పై 1930లో 974 పరుగులు, క్లైవ్ లాయిడ్ 1983లో ఇండియాపై 903 పరుగుల తర్వాత స్థానంలో కెప్టెన్ జో రూట్ 875 పరుగులతో ఉన్నాడు. ఈ సిరీస్‌లో అతడికి డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.