బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (BCCI) గౌరవ సెక్రటరీ, అమిత్ షా కుమారుడు జై షా చరిత్ర సృష్టించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్మల్ హసన్ పదవీకాలం అయిపోవడంతో ఇప్పుడు జై షా ఆ పదవీ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ పదవి కాలం రెండేళ్లు ఉంటుంది. ప్రతి రెండేళ్లకు ఓసారి రొటేషన్ అవుతూ ఉంటుంది. భారత్ వంతు వచ్చినప్పుడు సాధారణంగా బీసీసీఐ అధ్యక్షుడే ఈ పదవి చేపడతారు. కానీ, చరిత్రలో తొలిసారి బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఈ బాధ్యతలు చేపడుతున్నారు. బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ సింగ్ ధుమాల్ ఈ విషయాన్ని క్రిక్ బిజ్ వెబ్ సైట్‌కు ధ్రువీకరించారు. ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహ్సాన్ మణి క్రిక్బిజ్ వద్ద స్పందించారు. ‘ఏసీసీలో ఇది స్మూత్ ఆపరేషన్. ఇప్పుడు బీసీసీఐ వంతు వచ్చింది. వారిలో ఎవరిని నియమించాలనేది వారి ఇష్టం. ఆయనకు నా అభినందనలు.’ అని తెలిపారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వం, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశాల మధ్య ఆసియా కప్‌ను నిర్వహించడం జై షా ముందున్న పెద్ద సవాల్. వాస్తవానికి 2020లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ కారణంగా అది వాయిదా పడింది. 2021 జూన్‌లో ఆసియా కప్ జరపాలని నిర్ణయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci