భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ట్రెడిషనల్ టెస్ట్ ఫార్మాట్లో రికార్డ్ల మోత మోగిస్తున్నాడు. ఇంటర్నేషనల్ టెస్ట్‌ల్లో ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా చరిత్రను తిరగరాశాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనతో అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు. మెల్బోర్న్ క్రికెట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ బుమ్రాకు కెరీర్లో 9వ టెస్ట్. ఆడుతున్న తొమ్మిదో టెస్ట్‌లోనే అరుదైన రికార్డ్ నమోదు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.ఒకటి కాదు రెండు కాదు గత 39 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 151 పరుగులకే కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులేసి ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు. మెల్బోర్న్ పిచ్ కండీషన్స్‌కు తగ్గట్టుగా బౌలింగ్ చేసి కంగారూలను క్యూ కట్టించాడు. మార్కస్ హారిస్, షాన్ మార్ష్, ట్రావిస్ హెడ్, టిమ్ పెయిన్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్ బుమ్రా ధాటికి ఒకరి వెంట ఒకరు పెవిలియన్ చేరారు. 6 వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. కెరీర్లో రెండో సారి 5 వికెట్ల ఫీట్ రిపీట్ చేశాడు. 15.5 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఫీట్‌తో 9 టెస్ట్‌ల్లోనే బుమ్రా వికెట్ల సంఖ్య 45కు చేరుకుంది.
మెల్బోర్న్ టెస్ట్‌తో భారత మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ దిలీప్ దోషి రికార్డ్‌ను బుమ్రా బద్దలు కొట్టాడు. 1979లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన దిలీప్ దోషి....అదే సంవత్సరంలో 40 వికెట్లు పడగొట్టాడు. 39 ఏళ్ల తర్వాత బుమ్రా...దిలీప్ దోషీని వెనక్కునెట్టి ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.