ఒకవైపు కరోనా భయం.. మరోవైపు 56 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ నిర్వహించేందుకు దక్కిన అవకాశం. ఏడాదిగా విశ్వ క్రీడల విషయంలో మల్లగుల్లాలు పడిన జపాన్ ప్రభుత్వం (Japan) ఎట్టకేలకు తమ పంతం నెగ్గించుకున్నది. టోక్యో నగరంలో అత్యంత కట్టుదిట్టమైన కరోనా ఆంక్షలు (Corona Restrictions) విధించి మరీ మెగా క్రీడలను ప్రారంభించింది. ఒలింపిక్స్ కోసం వస్తున్న ఆథ్లెట్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా చూసిన నిర్వాహక కమిటీ.. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని (Opening Ceremony) కూడా ఆర్భాటంగా నిర్వహించింది. ఏదో సాదాసీదాగా నిర్వహిస్తారని అందరూ భావించినా.. గత ఓపెనింగ్ సెర్మనీలకు ఏ మాత్రం తగ్గకుండా జపాన్ తమదైన శైలిలో నిర్వహించింది. బాణ సంచా పేల్చి.. తమ సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించి.. లైట్ షోలతో ఆకట్టుకొని టోక్యో ఒలింపిక్స్ 2020ని ఘనంగా ప్రారంభించారు. 205 దేశాలకు చెందిన అథ్లెట్లు జపాన్ అక్షర మాల ప్రకారం పరేడ్ నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం ఎప్పటిలాగే గ్రీస్ దేశపు అథ్లెట్లు ముందు పరేడ్ నిర్వహించగా.. చివరిలో జపాన్ అథ్లెట్లు తమ జెండాలను చేతిలో పట్టుకొని టోక్యోలోని నేషనల్ స్టేడియంలో సందడి చేశారు. ఇండియా నుంచి వెళ్లిన అథ్లెట్లు వరుస క్రమంలో 21వ దేశంగా పరేడ్ చేసింది.
కరోనా నేపథ్యంలో ప్రతీ దేశం నుంచి అతి కొద్ది మంది అథ్లెట్లను మాత్రమే మార్చ్ పాస్ట్‌కు అనుమతించారు. ఇండియా నుంచి కేవలం 30 మంది మాత్రమే పరేడ్‌లో పాల్గొన్నారు. వెటరన్ బాక్సింగ్ ప్లేయర్ మేరీ కోమ్ ముందు నడవగా.. పురుషుల హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ మువ్వన్నెల జెండాను చేతబూని పరేడ్‌లో పాల్గొన్నాడు. వారితో పాటు ఆశిశ్ కుమార్, మనీశ్ కౌశిక్, అమిత్ పంగల్, పూజా రాణి, లవ్లీనా, సిమ్రాన్ జిత్ కౌర్, సాజన్ ప్రకాశ్, ప్రణతి నాయక్, భవానీ దేవి, నేత్ర కుమనన్, విష్ణ శరవణన్, వరుణ్ అశోక్, కేసీ గణపతి, శరత్ కమల్, జి. సతియన్, మనికా బాత్రా, సుతీర్థ ముఖర్జీ పరేడ్‌లో నడిచారు.
ఒలింపిక్ పరేడ్ సాంప్రదాయం ప్రకారం గత ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారే మార్చ్ పాస్ట్‌లో నడుస్తుంటారు. కానీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) మాత్రం ఈ సంప్రదాయాన్ని టోక్యో ఒలింపిక్స్‌లో కొనసాగించలేదు. మేరీ కోమ్ చివరి ఒలింపిక్స్ ఆడుతుండటంతో ఆమెకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. మరోవైపు రేపటి నుంచి బ్యాడ్మింటన్ పోటీలు కూడా ఉండటంతో పీవీ సింధు స్వచ్ఛందంగా పరేడ్ నుంచి తప్పుకున్నది. ఈ రోజు ఆర్చరీ బృందం కూడా తమ క్వాలిఫకేషన్ పోటీల్లో పాల్గొనడంతో పరేడ్‌కు గైర్హాజరయ్యారు. ఐవోఏ అధ్యక్షుడు నరీందర్ బత్రా టోక్యోలోనే క్వారంటైన్లో ఉండటంతో ఆయన కూడా ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి రాలేక పోయారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి జపాన్ చక్రవర్తి నరుహిటో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ పాల్గొన్నారు. పలు దేశాల అధ్యక్షులకు ఆహ్వానాలు అందినా కరోనా నేపథ్యంలో వాళ్లు తమ పర్యటనలు రద్దు చేసుకున్నారు. 2024లో పారీస్ వేదికగా ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఒలింపిక్ టార్చ్ అందుకోవల్సి ఉన్నందున ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
?@naomiosaka is your final Olympic flame torchbearer and has lit the #Olympics cauldron ?#Tokyo2020 | #OpeningCeremony | #UnitedByEmotion | #StrongerTogether pic.twitter.com/PQLe8FmX2v
— #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021
ఒలింపిక్స్ ప్రారంభోత్సవ మార్చ్ పాస్ట్‌లో తొలుత ఐవోసీ శరణార్ది స్టేడియంలోకి నడిచి రావం విశేషం. గత విశ్వ క్రీడల మాదిరిగానే ఈ ఏడాది కూడా ఐవోసీ తరపున శరణార్ది క్రీడాకారులు పాల్గొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేదికకు చేరుకున్న టార్చ్‌ను జపాన్‌కు చెందిన టెన్నిస్ ప్లేయర్ నయోమీ ఒసాకా అందుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020 తుది టార్చ్ బేరర్ ఆమే కావడం విశేషం. ఆ తర్వాత అధికారికంగా ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. జపాన్ చక్రవర్తి నారుహితో టోక్యోలో ఒలింపిక్స్ అధికారికంగా ప్రారంభం అయినట్లు ప్రకటించారు. శుక్రవారం టోక్యోలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఓపెనింగ్ సెర్మనీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు మూడు గంటల సేపు జరిగిన ఈ సెర్మనీలో ఒలింపిక్ జ్యోతిని వెలిగించిన తర్వాత చక్రవర్తి నారుహితో 'ఈ క్రీడలను ప్రారంభిస్తున్నాను' అని చెప్పి ఆయన అధికారికంగా టోక్యో ఒలింపిక్స్ ప్రారంభించారు. 68 వేల కెపాసిటీ కలిగిన నేషనల్ స్టేడియంలో కేవలం అతి కొద్ది మంది అతిథులు మాత్రమే పాల్గొనడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics