Pawan Kalyan: టీమిండియాపై పవన్ ప్రశంసలు.. ఆస్ట్రేలియాపై గెలుపు ఓ అద్భుతం

పవన్ కళ్యాణ్ (File/Photo)

ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం చారిత్రాత్మకమని.. బ్రిస్బేన్‌లో భారత జట్టు విజయం ఓ అద్భుతమని కొనియాడారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ అభినందనలను ట్విటర్‌లో షేర్ చేసింది జనసేన పార్టీ

  • Share this:
    ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలిచిన భారత జట్టుపై ప్రశంస జల్లు కురుస్తోంది. గాయాలు ఇబ్బంది పెడుతున్నా.. జట్టులో సీనియర్లు లేకున్నా.. పట్టువదలని విక్రమార్కుల్లా.. యువ ఆటగాళ్లు నిలిచి గెలిచిన తీరు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటగాళ్లు, సినీ, రాజకీయ నాయకులు టీమిండియాను మెచ్చుకుంటున్నారు. తాజాగా జనసేన అధినేత, టాలీవుడ్ నటుడు పవన్ కల్యాణ్ కూడా భారత యువ జట్టుకు అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం చారిత్రాత్మకమని.. బ్రిస్బేన్‌లో భారత జట్టు విజయం ఓ అద్భుతమని కొనియాడారు. ఈ మేరకు ఆయన అభినందనలను ట్విటర్‌లో షేర్ చేసింది జనసేన పార్టీ.

    ''భారత క్రికెట్ జట్టు ఆ దేశంలోనే టెస్ట్ సిరీస్ సాధించడం చారిత్రాత్మకం. బ్రిస్టేన్ మైదానంలో టెస్ట్ గెలిచిన తీరు ఓ అద్భుతం. మన క్రికెట్ జట్టుకు నా తరపున, జనసేన పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నా. ప్రతికూల పరిస్థితుల్లో సాధించిన ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. కీలక ఆటగాళ్ల గాయాల పాలైనా.. అంతర్జాతీయ వేదికపై తొలి అడుగులు వేస్తున్న క్రీడాకారులు చూపిన ప్రతిభ, విజయం కోసం కలిసికట్టుగా పోరాడిన విధానం ప్రశంసనీయం.'' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

    గబ్బాలో విజయంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది టీమిండియా. 2-1 తేడాతో సిరీస్‌ను గెలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలవడంతో పాటు.. 31 ఏళ్లుగా గబ్బాలో ఓటమి ఎరుగని ఆసీస్‌ను ఓడించడంతో.. ఈ గెలుపు భారత్‌కు ఎంతో చారిత్రాత్మకమైంది.


    గబ్బా టెస్ట్‌లో మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 369 పరుగులు చేసింది. ఇక టీమిండియా 336 పరుగులు చేసి.. కాస్త వెనకబడింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. 294 పరుగులకే ఆసీస్‌ను కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన భారత కుర్రాళ్లు అదరగొట్టాడు. 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచారు. ఈ టెస్ట్ మ్యాచ్‌ విజయంలో శుభమాన్ గిల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించారు. సిరీస్ గెలిచిన సందర్భంగా భారత జట్టుకు రూ.5 కోట్ల బోనస్ ప్రకటించింది బీసీసీఐ.
    Published by:Shiva Kumar Addula
    First published: