సైనా నెహ్వాల్... ఇండియన్ బ్యాడ్మింటన్‌లో ఈ పేరు ఓ సంచలనం. అనితర సాధ్యమైన విజయాలతో ఎందరో అమ్మాయిలు క్రీడారంగంవైపు అడుగులు వేసేందుకు ఆదర్శంగా నిలిచింది సైనా నెహ్వాల్. అలాంటి సైనా నెహ్వాల్ జీవితకథ ఆధారంగా బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘స్నిఫ్’, ‘హవా హవాయ్’, స్టాన్లే కా డబ్బా’ వంటి విభిన్న చిత్రాల దర్శకుడు అమోల్ గుప్తే దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్, సైనా నెహ్వాల్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సైనా బయోపిక్ కోసం కొంత కాలం గ్రౌండ్ వ్క్ చేసిన శ్రద్ధాకపూర్... బ్యాడ్మింటన్‌లో శిక్షణ కూడా తీసుకుంది. లుక్స్ పరంగా కూడా సైనా నెహ్వాల్‌కు దగ్గరగా ఉండే శ్రద్ధాకపూర్... స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్రలో ఎలా మెప్పిస్తుందోననే క్యూరియాసిటీ కూడా జనాల్లో పెరిగిపోయింది.
అయితే అనుకోకుండా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది శ్రద్ధాకపూర్. ఆ స్థానంలోకి బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రాను తీసుకున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. బ్యాడ్మింటన్‌లో ట్రైనింగ్ తీసుకుని, వర్క్ షాప్ కూడా నిర్వహించిన తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ బయోపిక్ నుంచి శ్రద్ధాకపూర్ తప్పుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే శ్రద్ధా డేట్స్ కారణంగా షూటింగ్ బాగా ఆలస్యమవుతుండడమే ఈ మార్పుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘సాహో’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది శ్రద్ధాకపూర్. ఈ సినిమాతో పాటు బాలీవుడ్లో ‘చిచ్చోరే’, ‘స్ట్రీట్ డ్యాన్స్ 3D’, ‘భాగి 3’ సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది శ్రద్ధా. అదీగాక కొన్నాళ్లక్రితం ఈ హాట్ బ్యూటీకి డెంగీ సోకింది. ఈ కారణంగానే గత ఏడాది సెప్టెంబర్ 27 నుంచి ఆమె సైనా నెహ్వాల్ బయోపిక్ షూటింగ్లో పాల్గొనడం లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ 2019 చివరికల్లా పూర్తిచేసి 2020లో విడుదల చేయాలని భావించారు నిర్మాతలు. శ్రద్ధాకపూర్ ఆరోగ్యం, బిజీ షెడ్యూల్ కారణంగా అది సాధ్యంకాదని తేలడంతో ఆ ప్లేస్‌లోకి పరిణీతి చోప్రా వచ్చి చేరింది.
ఎటువంటి వివాదం లేకుండా పరస్పర అంగీకారంతో ఇటు శ్రద్ధాకపూర్, దర్శకనిర్మాతలు కలిసి సినిమాలో మార్పు చేసినట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న పరిణీతి చోప్రాకు సైనా నెహ్వాల్ బయోపిక్ చాలామంచి అవకాశమనే చెప్పాలి. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బయోపిక్ తీస్తే... తన పాత్రలో ఆమె ఫ్రెండ్ పరిణీతి చోప్రాయే నటించాలని సానియా పేర్కొంది. అది కూడా సెట్స్‌మీదకి వస్తే ఇద్దరు క్రీడాకారిణుల బయోపిక్‌లో నటించిన అరుదైన రికార్డు పరిణీతి సొంతం చేసుకుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Saina Nehwal, Shraddha Kapoor