ISL 2022 : ఇండియన్ సూపర్ లీగ్(ISL)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో జోరుమీదున్న డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(Hyderabad FC)..చెన్నైయిన్ ఎఫ్‌సీ (Chennaiyin FC)తో పోరుకు సై అంటున్నది. గురువారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా హెచ్‌ఎఫ్‌సీ, చెన్నై జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది. లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న హెచ్‌ఎఫ్‌సీ డబుల్ హ్యాట్రిక్‌పై కన్నేయగా, చెన్నై ప్రస్థానం పడుతూ లేస్తూ సాగుతున్నది. గత మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీని చిత్తుచేసిన హెచ్‌ఎఫ్‌సీ..అదే దూకుడుతో చెన్నైని మట్టికరిపించాలని చూస్తున్నది. దీనికి తోడు సొంతగడ్డపై అభిమానుల మద్దతు హైదరాబాద్‌కు అదనపు బలం కానుంది. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 10 విజయాలతో హెచ్‌ఎఫ్‌సీ ప్రస్తుతం 31 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, చెన్నై 15 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. బలబలాల పరంగా హైదరాబాద్‌తో పోలిస్తే..చెన్నై అంత దీటైన పోటీనిచ్చే అవకాశం కనిపించడం లేదు. సొంత ఇలాఖాలో ఈ ఏడాదిని విజయంతో మొదలుపెట్టాలని హెచ్‌ఎఫ్‌సీ ధృడ విశ్వాసంతో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య రసవత్తర పోరుకు ఆస్కారం ఉంది.
ఇది కూడా చదవండి : టీమిండియాలో మూడు ముక్కలాట.. ఆ ముగ్గురిలో ఒకరికే ఛాన్స్.. కుంపటి మీద రోహిత్!
దూకుడు కొనసాగిస్తాం: మనాలో మార్కజ్ (హైదరాబాద్ టీం మేనేజర్)
చెన్నైయిన్‌తో మ్యాచ్ సందర్భంగా బుధవారం హెచ్‌ఎఫ్‌సీ కోచ్ మనాలో మనాలో మార్కజ్ మాట్లాడుతూ ‘చెన్నై బలమైన జట్టు.పీటర్ స్లిస్కోవిచ్, జులియస్ డకెర్, ఆకాశ్ సాంగ్వాన్, విన్సీ బారెటో, ఎడ్విన్ వాన్స్‌పాల్, వఫా హకమెన్సీ, అనిరుధ్‌తో ధీటైన పోటీనిచ్చేలా ఉంది. సెమీస్ లక్ష్యంగా వాళ్లు విజయం కోసం బరిలోకి దిగే అవకాశముంది. రిస్క్ తీసుకోవడానికి వెనుకంజ వేయకపోవడం చెన్నై నైజం. ప్రతీ మ్యాచ్‌కు ఆటతీరును మెరుగుపర్చుకుంటూ పోటీనివ్వడం వాళ్లకు చెల్లుతుంది. హెచ్‌ఎఫ్‌సీ విషయానికొస్తే మా ఆటతీరుకు కట్టుబడి ఉన్నాం. ప్రతి ప్రత్యర్థి వైవిధ్యమైన శైలి కల్గి ఉంటారు. అందుకు తగ్గట్లు ప్రణాళిక ఎంచుకుంటాం. మిగిలిన సీజన్‌లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటాం’ అని అన్నాడు.
ఫామ్‌మీద హెచ్‌ఎఫ్‌సీ
లీగ్‌లో హెచ్‌ఎఫ్‌సీ ప్లేయర్లు మంచి ఫామ్‌మీదున్నారు. ఆరంభంలో ఒకింత తడబడ్డ స్టార్ ౖస్ట్రెకర్ ఒగ్బాచె..గత మ్యాచ్‌ల్లో అదరగొట్టాడు. హ్యాట్రిక్ గోల్స్‌కు తోడు ఆరు గోల్స్‌తో అతడు కొనసాగుతున్నాడు. ఒగ్బాచెకు తోడు జేవియర్ సివేరియో, బోర్జా హెరెరా, జోయల్ చియానిస్, యాసిర్, హలీచరణ్ నర్జారీ, అబ్దుల్ రబీహ్, రోహిత్ దానుతో జట్టు బలంగా కనిపిస్తున్నది. ఇదిలా ఉంటే తొలి అంచెలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో హెచ్‌ఎఫ్‌సీ 3-1తో ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే సీన్ పునరావృతం చేసేందుకు హెచ్‌ఎఫ్‌సీ పట్టుదలతో కనిపిస్తున్నది.
మ్యాచ్: రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, Football, Hyderbad, Indian Super League