BCCI : బీసీసీఐకి కొత్త ఏసీయూ చీఫ్.. ఐపీఎల్ ప్రారంభం నేపథ్యంలో కీలక నిర్ణయం

Jio Cricket plans: ఐపీఎల్ స్పెషల్... జియో అందిస్తున్న క్రికెట్ ప్లాన్స్ ఇవే (image: IPL)

  • Share this:
    బీసీసీఐ (BCCI) లో కీలక విభాగమైన యాంటీ కరప్షన్ యూనిట్ (Anti Corruption Unit) కి కొత్త బాస్‌ను నియమించారు. గతంలో ఏసీయూ చీఫ్‌గా వ్యవహరించిన అజిత్ సింగ్ షెకావత్ పదవీకాలం మార్చి 31న ముగిసింది. మరో ఐదు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)(IPL) ప్రారంభం కానున్న నేపథ్యంలో గుజరాత్ మాజీ డీజీపీ షాబిర్ హుస్సేన్ షెఖదమ్‌ను కొత్త ఏసీయూ చీఫ్‌గా నియమించింది. ఐపీఎల్‌లో బెట్టింగ్ మాఫియా పెరిగిపోతుండటంతో బుకీలపై నిఘా తప్పనిసరి అవుతున్నది. అందుకే పాత చీఫ్ పదవీకాలం ముగిసిన వెంటనే కొత్త నియామకం చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుండటంతో షాబిర్ హుస్సేన్ రెండు రోజుల్లో అక్కడకు ప్రయాణమవుతారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆటగాళ్లందరికీ అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా కొత్త ఆటగాళ్లకు అవినీతి నుంచి దూరంగా ఎలా ఉండాలనే దానిపై అవగాహన ఉండదు కాబట్టి.. వారిని అప్రమత్తం చేయాల్సి ఉంటుందని షాబిర్ హుస్సేన్ అన్నారు.

    'ఏసీయూ రెండు బృందాలుగా విడిపోయి చెన్నై, ముంబై ప్రయాణం అవుతాయి. రెండు నగరాల్లో ఉన్న ఎనిమిది జట్లలోని ఆటగాళ్లకు ఒకసారి పూర్తి అవగాహన కల్పిస్తాము. బుకీలు ఆటగాళ్లను ఎలా సంప్రదిస్తారు. సోషల్ మీడియా ద్వారా ఆటగాళ్లకు ఎలా వలవేస్తారనే దానిపై పూర్తిగా పీపీటీ ప్రెజెంటేషన్ ఇస్తాము. గతంలో ఆటగాళ్లను ఎలా సంప్రదించి లోబరుచుకున్నారు అనే ఉదాహరణలు కూడా చెప్తాము' అని కొత్త బాస్ షాబిర్ హుస్సేన్ తెలిపారు. పాత ఏసీయూ చీఫ్ అజిత్ సింగ్ కాలంలో అనేక మంది బుకీలను అరెస్టు చేసి జైలుకు పంపించారు. కొని ఫాంటసీ లీగ్ సంస్థలు ఎలా అనధికార క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారేది కూడా దర్యాప్తు చేసి బీసీసీఐ, ఐసీసీ దృష్టికి తీసుకొని వచ్చారు. కాగా, బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆయన పదవీ కాలం ముగియడంతో బాధ్యతలు కొత్త బాస్‌కు అప్పగించారు.

    బీసీసీఐ ఏసీయూ యూనిట్‌లో చీఫ్‌తో పాటు పలువురు రిటైర్ పోలీసు అధికారులు, ఇతర దర్యాప్తు సంస్థల్లో పని చేసి వచ్చిన అధికారులు ఉంటారు. ఆటగాళ్లు, యాజమాన్యం ఇతర సిబ్బందిపై వీరు నిరంతరం నిఘా పెడతారు. ఎవరైనా ఆటగాళ్లు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే వారికి హెచ్చరికలు జారీ చేస్తారు. గతంలో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారాన్ని ఢిల్లీ పోలీసులు వెలుగులోకి తీసుకొని వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీసీసీఐ తమకు సొంతగా ఒక యాంటీ కరప్షన్ యూనిట్ ఉండాలని నిర్ణయం తీసుకున్నది.
    Published by:John Naveen Kora
    First published: