ఐపీఎల్ 2021 : షెడ్యూల్ మొత్తం గందరగోళం.. వాయిదా వేయక తప్పదా? ఐసోలేషన్‌లోకి మరిన్ని టీమ్స్?

ఐపీఎల్ ఇక వాయిదా పడ్డట్లేనా? షెడ్యూల్ గందరగోళం

 • Share this:
  ఐపీఎల్ 2021 సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత కరోనా కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తున్నది. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో బీసీసీఐ సోమవారం జరగాల్సిన మ్యాచ్‌ను కూడా వాయిదా వేసింది. ప్రస్తుతం వరుణ్, సందీప్ ఇద్దరినీ మిగతా క్రికెటర్లు, సిబ్బంది నుంచి వేర్వేరుగా ఐసోలేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ బృందం వారిద్దరితో పాటు మొత్తం కేకేఆర్ జట్టును ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. సోమవారం జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడటంతో దాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై బీసీసీఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కాగా, ఐపీఎల్ సీజన్‌కు ముందు బీసీసీఐ కొన్ని ప్రోటోకాల్స్ విడుదల చేసింది. దీని ప్రకారం కేకేఆర్ జట్టుతో ఇటీవల కాలంలో ఆడిన జట్లన్నీ ఐసోలేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కేకేఆర్‌తో మ్యాచ్‌లు జరిగాయి. దీంతో ఈ జట్లన్నీ ఐసోలేషన్‌కు వెళ్లాల్సి ఉన్నది. అలాగే కేకేఆర్ ఆడిన మ్యాచ్‌లకు సంబంధించిన అంపైర్లు, రిఫరీ కూడా క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఐపీఎల్ కోవిడ్ గైడ్ లైన్స్ ప్రకారం కరోనా బారిన పడిన వారితో క్లోజ్ కాంటాక్ట్ అయిన వ్యక్తులు తప్పని సరిగా 6 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ సమయంలో డే 1, 3, 6న జరిపే మూడు కరోనా టెస్టుల్లో కూడా నెగెటివ్ రిపోర్టు వస్తేనే వారిని తిరిగి బబుల్‌లోకి అనుమతిస్తారు.

  ఇప్పుడు కేకేఆర్ జట్టులోని ఇద్దరు కరోనా బారిన పడటంతో.. వారితో మ్యాచ్ ఆడిన జట్లన్నీ ఐసోలేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే ఐపీఎల్ షెడ్యూల్ మొత్తం గందరంగోళం అయ్యే పరిస్థితి నెలకొన్నది. షెడ్యూల్ ప్రకారం మే 30తో ఐపీఎల్ ముగియనున్నది. ఐపీఎల్‌లో ఆడుతున్న విదేశీ క్రికెటర్లు జూన్ నెలలో తమ జాతీయ జట్ల తరపున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నది. అంతే కాకుండా ఇండియా, న్యూజీలాండ్ జట్లు జూన్ నెలలోనే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాలి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ మే 30 తర్వాత పొడిగించే పరిస్థితి లేదు.

  వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు వెళ్లాల్సిన ఇరు జట్లు 15 రోజుల ముందుగానే అక్కడకు చేరుకొని క్వారంటైన్‌లో ఉండాల్సి రావడంతో.. ఐపీఎల్ షెడ్యూల్‌ను ఎలా మార్చాలనే దానిపై సందిగ్దత నెలకొన్నది. షెడ్యూల్ మార్చడం కుదరక పోతే ఐపీఎల్‌ను వాయిదా వేయక తప్పదనే వార్తలు వస్తున్నాయి. గత వారంలో ఐపీఎల్ నుంచి పలువురు ఆటగాళ్లు వెళ్లిపోవడంతో బీసీసీఐ బయోబబుల్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. అయినా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తున్నది.
  Published by:John Naveen Kora
  First published: