హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: ఐపీఎల్ 2022 రిటెన్షన్ రూల్స్ ఇవే.. ఫ్రాంచైజీలు ఎంత మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు? కొత్త జట్లకు బంపర్ ఆఫర్

IPL 2022: ఐపీఎల్ 2022 రిటెన్షన్ రూల్స్ ఇవే.. ఫ్రాంచైజీలు ఎంత మంది ఆటగాళ్లను ఉంచుకోవచ్చు? కొత్త జట్లకు బంపర్ ఆఫర్

ఐపీఎల్ 2022లో రిటెన్షన్ రూల్స్ ఇవే.. (PC: IPL)

ఐపీఎల్ 2022లో రిటెన్షన్ రూల్స్ ఇవే.. (PC: IPL)

IPL 2022: ఐపీఎల్ 2022లో కొత్త జట్లు వచ్చి చేరడంతో బీసీసీఐ మెగావేలానికి సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. వేలానికి ముందు పాత ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకోవడానికి వీలు కల్పించింది. అలాగే కొత్త జట్లకు ఫ్రీ పికప్ ఆప్షన్ ఇచ్చింది.

ఇంకా చదవండి ...

ఐపీఎల్ 2022 సీజన్ (IPL 2022) కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రెండు కొత్త జట్లను ఖరారు చేయగా.. ఇక ఆటగాళ్ల రిటెన్షన్ విధానంపై పలు సూచనలను పరిగణలోకి తీసుకొని నిబంధనలను ప్రకటించింది. ఇప్పటికే ఉన్న 8 జట్లకు తోడు కొత్తగా వచ్చిన రెండు జట్లు చేరాయి. 2011లో నిర్వహించిన లీగ్ ఫార్మాట్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా, ఐపీఎల్ 2022 కోసం వచ్చే ఏడాది మొదట్లో బీసీసీఐ (BCCI) మెగా వేలాన్ని (Mega Auction) నిర్వహించనున్నది. ఎప్పటి లాగానే ఈ సారి కూడా రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ప్రకటించింది. కొత్త రిటెన్షన్ (Retention) విధానం ప్రకారం నలుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు విడుదల చేయకుండా ఉంచుకోవచ్చు. అయితే ఈ సారి రైట్-టు-మ్యాచ్ నిబంధనను తొలగించింది. ఏ ఫ్రాంచైజీ అయినా రిటెన్షన్ ద్వారానే ఆటగాళ్లను తమతో ఉంచుకోవడానికి వీలుపడుతున్నది. ఈ రిటెన్షన్ పాలసీ, మెగా ఆక్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు తెలియజేశారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావల్సి ఉన్నది.

ఈ సారి మెగా వేలానికి ముందు ప్రతీ ఫ్రాంచైజీ నలుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో ముగ్గురు ఇండియన్, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు ఇండియన్, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండవచ్చు. అలాగే ముగ్గురు భారత క్రికెటర్లను రిటైన్ చేసుకోవాలనుకుంటే అందులో అందరూ క్యాప్డ్ ప్లేయర్లు లేదా అందరూ అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉండొచ్చు. అయితే ఈ సారి రైట్-టు-మ్యాచ్ కార్డు ఉండదు. రైట్ టూ మ్యాచ్ అంటే ఎవరైనా ఫ్రాంచైజీ కీలకమైన ఆటగాడిని విడుదల చేస్తే.. అతడిని వేరే ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే రైట్-టు-మ్యాచ్ ద్వారా సొంత ఫ్రాంచైజీ తిరిగి తీసుకునే వీలుంటుంది. కానీ ఈ సారి అలాంటి అవకాశం ఉండదు. మెగా ఆక్షన్‌కు ముందే ఎవరిని జట్టుతో ఉంచుకోవాలి.. లేదా ఎవరిని వదిలేయాలనేది నిర్ణయించుకోవల్సి ఉంటుంది.

కొత్త విధానంతో పాత జట్లు మొత్తం 32 మంది ఆటగాళ్లు ఆయా జట్లతో ఉండే అవకాశం ఉన్నది. మిగిలిన ఆటగాళ్లు అందరూ సెంట్రల్ పూల్‌లోకి వస్తారు. అయితే కొత్తగా చేరిన రెండు జట్లకు ఈ విధానం వల్ల నష్టం చేకూరే అవకాశం ఉన్నది. ఎందుకంటే వాళ్ల దగ్గర రిటైన్ చేసేకోవడానికి ఆటగాళ్లు ఉండరు. అందుకే ఇందు కోసం బీసీసీఐ 'ఫ్రీ పికప్' అనే ఆప్షన్ ఇచ్చింది. కొత్తగా వచ్చిన రెండు జట్లు వేలానికి ముందు సెంట్రల్ పూల్‌లో ఉన్న ఆటగాళ్లలో ముగ్గురిని తీసేసుకోవచ్చు.

పాత జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు మినహా.. మిగిలిన ఆటగాళ్లలో ఎవరైనా ముగ్గురిని వేలానికి ముందే జట్టులోకి తీసుకోవచ్చు. దీనివల్ల పాత-కొత్త జట్లకు సమన్యాయం జరుగుతుందని బీసీసీఐ చెబుతున్నది. మరోవైపు ఫ్రీ పికప్ చేసుకోవడానికి మొదటిగా లక్నో ఫ్రాంచైజీకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త జట్ల టెండర్లలో అది అత్యధిక మొత్తం చెల్లించింది కాబట్టి. అంటే ముందుగా లక్నో ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసుకన్న తర్వాతే అహ్మదాబాద్‌కు అవకాశం వస్తుంది.

ఈ సారి మెగా వేలంలో పర్స్ వాల్యూని రూ. 85 కోట్ల నుంచి రూ. 90 కోట్లకు పెంచారు. రిటెన్షన్ చేసుకున్న, ఫ్రీ పికప్ చేసుకున్న ఆటగాళ్ల విలువతో కలపి మొత్తం ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి రూ. 90 కోట్ల వరకు వినియోగించే అవకాశం ఉన్నది. ఇక రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జీతాలను కూడా బీసీసీఐ డిసైడ్ చేసింది. ముగ్గురు ఆటగాళ్లను కనుక రిటైన్ చేసుకుంటే వారికి వరుసగా రూ. 15 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 7 కోట్లు తప్పక చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆయా ఆటగాళ్ల జీతం బీసీసీఐ చెప్పిన తక్కువగా ఉన్నప్పుడే ఇలా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రస్తుత జీతాన్నే కొనసాగించవచ్చు.

ఉదాహరణకు ఆర్సీబీ కనుక కోహ్లీని రిటైన్ చేసుకుంటే బీసీసీఐ నిబంధన ప్రకారం రూ. 15 కోట్ల జీతం చెల్లించాలి. కానీ ఇప్పటికే కోహ్లీకి రూ. 17 కోట్లు చెల్లిస్తున్నందున.. ఇదే జీతాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఒక వేళ ఇద్దరు ఆటగాళ్లనే రిటైన్ చేసుకుంటే మొదటి ఆటగాడికి రూ. 12.5 కోట్లు, రెండో ఆటగాడికి రూ. 8.5 కటోలు.. ఒక్కరినే రిటైన్ చేసుకుంటే రూ. 12.5 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.

First published:

Tags: Bcci, IPL

ఉత్తమ కథలు