ఐపీఎల్ మీడియా హక్కులకు సంబంధించిన ఈ-వేలం జోరుగా సాగింది. 2023-2027 కాలానికి గాను ముంబైలో బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహించిన సంగతి తెలిసిందే. 2023-2027 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల కోసం మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించి ఈ వేలం నిర్వహించారు. మొత్తంగా ఐదేళ్లకు కలిసి 370 మ్యాచులకు కలిపి రూ.43,255 కోట్లు వద్ద బిడ్డింగ్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ హక్కుల్ని సోనీ నెట్‌వర్క్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. వయాకామ్,డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమేజాన్, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు... ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి.
అయితే వయాకామ్, అమేజాన్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు, ఐపీఎల్ మీడియా బిడ్డింగ్ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐకి నిరాశ తప్పదేమో అనుకున్నారంతా. అయితే స్టార్ స్పోర్స్, సోనీ నెట్‌వర్క్ కలిసి బిడ్డింగ్ పెంచుతూ పోయాయట. చివరికి ఒక్కో మ్యాచ్ ప్రసారానికి టీవీ రైట్స్‌కి రూ.57.5 కోట్లు, డిజిటల్ రైట్స్‌కి రూ.48 కోట్లు చెల్లించడానికి సోనీ నెట్‌వర్క్ సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఒక్కో మ్యాచ్ కోసం రూ.105.5 కోట్లు బీసీసీఐకి చెల్లించనుంది సోనీ.
ఒక్కో మ్యాచ్ ద్వారా రూ.105.5 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న ఐపీఎల్, ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్‌గా రెండో స్థానంలో నిలవనుంది. ఇప్పటికే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్-ఫుట్‌బాల్)ని దాటేసిన ఐపీఎల్, అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (NFL) తర్వాతి స్థానంలో నిలిచింది.
బిడ్డింగ్ ప్రక్రియను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ‘ఎ’ ప్యాకేజీ ప్రకారం భారత ఉపఖండంలో టీవీ హక్కులు, ‘బి’ ప్యాకేజీ కింద భారత ఉపఖండంలో డిజిటల్ రైట్స్, ‘సి’లో ప్లేఆఫ్స్ సహా 18 మ్యాచ్‌లకు డిజిటల్ హక్కులు, ‘డి’ ప్యాకేజీని భారత ఉపఖండం మినహా మిగతా దేశాల్లో టీవీ, డిజిటల్ హక్కుల కోసం నిర్ణయించారు.
‘ఎ’ ప్యాకేజీలో కనీస ధరగా ఒక్కో మ్యాచ్‌కు రూ. 49 కోట్లు.. ‘బి’లో ఒక్కో మ్యాచ్‌కు రూ. 33 కోట్లు.. ‘సి’లో ధర రూ. 11 కోట్లు.. ‘డి’ కింద రూ. 3 కోట్లు ప్రాథమిక ధరగా బోర్డు నిర్ణయించింది.2017లో స్టార్ ఇండియా సంస్థ ఐదేళ్ల కాలానికిగాను రూ. 16,347 కోట్లతో ఐపీఎల్ టీవీ, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.