KKR vs RCB: విరాట్ సేనకు రెండో విజయం... పోరాడి ఓడిన కోల్‌కతా...

KKR vs RCB: విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ... మొయిన్ ఆలీ హాఫ్ సెంచరీ... సిక్సర్లతో కోహ్లీసేనకు చుక్కలు చూపించిన రస్సెల్... 10 పరుగుల తేడాతో రెండో విజయాన్ని దక్కించుకున్న విరాట్ కోహ్లీ టీమ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 20, 2019, 7:59 AM IST
KKR vs RCB: విరాట్ సేనకు రెండో విజయం... పోరాడి ఓడిన కోల్‌కతా...
KKR vs RCB: విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ... మొయిన్ ఆలీ హాఫ్ సెంచరీ... సిక్సర్లతో కోహ్లీసేనకు చుక్కలు చూపించిన రస్సెల్... 10 పరుగుల తేడాతో రెండో విజయాన్ని దక్కించుకున్న విరాట్ కోహ్లీ టీమ్...
  • Share this:
IPL 2019 Live Score, KKR vs RCB Match at Eden Gardens: 214 భారీ లక్ష్యాన్ని కాపాడుకుంటూ సీజన్‌లో రెండో విజయాన్ని కైవసం చేసుకుంది బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్రిస్‌లీన్ 1 పరుగు చేసి, అవుట్ కాగా... సునీల్ నరైన్ 18 పరుగులు, శుబ్‌మన్ గిల్ 9 పరుగులు, రాబిన్ ఊతప్ప 9 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 79 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కోల్‌కతా. అయితే నితీశ్ రాణాతో జతకలిసిన భారీ హిట్టర్ రస్సెల్... అనూహ్యంగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మొదట్లొ ఇద్దరూ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో 14 ఓవర్లకు 101 పరుగులు చేసింది కోల్‌కతా. అయితే చాహాల్ ఓవర్‌లో మూడు సిక్సర్లతో రస్సెల్ చెలరేగిపోయాడు. నవ్‌దీప్ శైనీ వేసిన 16వ ఓవర్‌లో రాణా రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 17 పరుగులు రాబట్టాడు. 17వ ఓవర్‌లో 15 పరుగులు రాబట్టిన రస్సెల్ జట్టు స్కోరు 150 పరుగులు దాటించాడు. డేల్ స్టెయిన్ వేసిన 18వ ఓవర్‌లో 18 పరుగులు రాబట్టిన రాణా... కోల్‌కతాను విజయానికి దగ్గర చేశాడు. అయితే 19వ ఓవర్‌లో రస్సెల్‌ మొదటి మూడు బంతుల్లో పరుగులేమీ రాబట్టలేకపోయాడు. ఆ తర్వాత వరుసగా రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదుచేశాడు ఆండ్రే రస్సెల్. ఆ తర్వాతి బంతిని కూడా సిక్స్‌గా మలచడంతో చివరి ఓవర్‌లో కోల్‌కతా విజయానికి 24 పరుగులు అవసరమయ్యాయి.

చివరి ఓవర్ సాగిందిలా...
మొయిన్ ఆలీ వేసిన మొదటి బంతికి నితీశ్ రాణా పరుగులేమీ రాబట్టలేకపోయాడు. రెండో బంతికి సింగిల్ తీసి, రస్సెల్‌‌కు స్టైక్ ఇచ్చాడు రాణా. మూడో బంతికి సిక్స్ రాబట్టిన రస్సెల్... నాలుగో బంతికి పరుగులు రాబట్టలేకపోయాడు. దాంతో చివరి రెండు బంతుల్లో విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. ఆ తర్వాతి బంతికే డేంజరస్ మ్యాన్ ఆండ్రే రస్సెల్ రనౌట్ అయ్యాడు. 25 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో కోహ్లీ సేనకు మరోసారి చుక్కలు చూపించాడు రస్సెల్. నితీశ్ రాణా ఆఖరి బంతిని సిక్స్‌గా మలిచినా... బెంగళూరు జట్టుకు 10 పరుగుల తేడాతో విజయం దక్కింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ పార్థివ్ పటేల్ 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్ష్‌దీప్ నాథ్ కూడా 13 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 59 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టును కెప్టెన్ విరాట్ కోహ్లీ, మొయిన్ ఆలీ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసిన మొయిన్ ఆలీ... కుల్దీప్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు, ఫోర్ రాబట్టి, అదే ఓవర్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్‌(17 పరుగులు)తో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు కోహ్లీ. 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ... ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు. ఐపీఎల్ కెరీర్‌లో విరాట్ కోహ్లీకి ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. కోహ్లీ ఇన్నింగ్స్‌లో మొదటి 40 బంతుల్లో 50 పరుగులు చేయగా, తర్వాత 17 బంతుల్లోనే మిగిలిన 50 పరుగులు రాబట్టాడు విరాట్ కోహ్లీ.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు