IPL 2021 వేలం హాట్ హాట్ గా సాగింది. 292 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా..57 మంది ఆటగాళ్లకు అవకాశం దక్కింది. ఈ మినీ వేలంలో 8 ఫ్రాంచైజీలు రూ. 145 కోట్ల 30లక్షలను ఖర్చు చేశాయి. అయితే, ఐపీఎల్ 2021 వేలంలో అనామక క్రికెటర్ షారుఖ్ ఖాన్‌పై కనక వర్షం కురిసింది. తమిళనాడు చెందిన ఈ బ్యాట్స్‌మన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రతిష్టాత్మక డొమెస్టిక్ టోర్నీ సెమీఫైనల్లో 19 బంతుల్లో 40 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. దాంతో ఈ యువ ఆటగాడిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఈ యువ ఆల్‌రౌండర్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కోసం ఇతర ఫ్రాంచైజీలు కూడా పోటీ పడటంతో ధర అమాంతం పెరిగిపోయింది. ఇక షారుఖ్‌ఖాన్ రికార్డు స్థాయిలో ధర పలకడంతో ఆ జట్టు దేశవాళీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలారు. తోటి ఆటగాడిని పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ రూ.5.25 కోట్లకు పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడంతో బస్సులోనే కేరింతలు కొట్టారు. ఆ సంతోషకరమైన క్షణాలను వీడియో చిత్రీకరించగా.. కెప్టెన్ దినేశ్ కార్తీక్ దాన్ని ట్విటర్‌లో అభిమానులతో పంచుకొన్నాడు.
అయితే, గురువారం వేలం జరుగుతుండగా తమిళనాడు ఆటగాళ్లంతా విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ కోసం బస్సులో వెళుతున్నారు. అదే సమయంలో ఆటగాళ్లంతా ఫోన్‌లో వేలం పాటను వీక్షించారు. సరిగ్గా అదే సమయంలో షారుఖ్‌ను పంజాబ్ కొనుగోలు చేయడంతో సంతోషంగా గంతులేశారు. గట్టిగా అరుస్తూ తమ ఆటగాడి ఎదుగుదలపై హర్షం వ్యక్తం చేశారు.
Turn up the volume and listen to the team's happiness for our bright ⭐#IPLAuction pic.twitter.com/wkDfFbqGGP
— DK (@DineshKarthik) February 18, 2021
ఇక షారుఖ్ ఖాన్‌కు ఇదే ఫస్ట్ ఐపీఎల్ సీజన్. గత వేలంలో అతనికి నిరాశే ఎదురైంది. దానికి ఏమాత్రం నిరాశ చెందని ఈ తమిళనాడు క్రికెటర్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇరగదీశాడు. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తనదైన బ్యాటింగ్‌తో ఆకట్టుకొని ఐపీఎల్ వేలం జాక్‌పాట్ కొట్టాడు. ఇక కృష్ణప్ప గౌతమ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. సచిన్ బేబీ, రజత్ పటీదర్‌లను రూ.20 లక్షల కనీధరకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అదరగొట్టిన మహ్మద్ అజారుద్దీన్‌ను కూడా ఆర్‌సీబీ రూ.20 లక్షల కనీస ధరకు తీసుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL 2021, T20 Auction 2021