దాదాపు 7 గంటల పాటు సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మినీ వేలం ముగిసింది. మొత్తం 405 మంది వేలంలోకి రాగా.. 80 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యధికంగా 13 మంది ప్లేయర్లను సొంతం చేసుకుంది. అతి తక్కువగా ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 5 మంది ప్లేయర్లను సొంతం చేసుకుంది. వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్ల పంట పండింది. స్యామ్ కరణ్ రూ. 18.50 కోట్లతో ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా రికార్డుకెక్కాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ కామెరూన్ గ్రీన్ ను రూ. 17.50 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. బెన్ స్టోక్స్ రూ. 16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఐర్లాండ్ బౌలర్ జాషువా లిటిల్ కు రూ 4.40 కోట్ల ధర పలికాడు. ముఖేశ్ కుమార్ ను రూ. 5.50 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోవడం విశేషం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మినీ వేలాని (IPL 2023 Mini Auction)కి రంగం సిద్ధమైంది. కొచ్చి వేదికగా కాసేపట్లో ఈ వేలం జరగనుంది. సామ్ కరన్, స్టోక్స్, కామెరాన్ గ్రీన్ వంటి మేటి ఆల్‌రౌండర్లు శుక్రవారం జరిగే వేలంపై ఆసక్తిని అమాంతం పెంచేస్తున్నారు.మొత్తం 405 మంది ప్లేయర్లు ఈ వేలంలో పాల్గొంటారు. ఇందులో 273 మంది భారత ప్లేయర్లు ఉండగా.. 132 మంది విదేశీ ప్లేయర్లు. ఇందులో నుంచి ఫ్రాంచైజీలు గరిష్టంగా 87 మందిని మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. మొదట 991 మంది ప్లేయర్లు వేలం కోసం రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీలు 405 మందిని షార్ట్ లిస్ట్ చేశారు.
మొత్తం 991 మంది ప్లేయర్లు మినీ వేలం కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఫ్రాంచైజీలు వారి సంఖ్యను 405కు తగ్గించింది. ఐపీఎల్ 10 ఫ్రాంచైజీలను కలుపుకుని 87 స్లాట్ లు ఖాళీగా ఉన్నాయి. అంటే డిసెంబర్ 23న జరిగే వేలంలో 405 మంది ప్లేయర్లలో గరిష్టంగా కేవలం 87 మందిని మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. షార్ట్ లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లను మొత్తం 5 సెట్లుగా విభజించారు.
తొలి సెట్లో బ్యాటర్లు ఉండగా.. రెండో సెట్లో ఆల్‌రౌండర్లు ఉన్నారు. మూడో సెట్లో వికెట్ కీపర్లను చేర్చగా.. నాలుగో సెట్లో ఫాస్ట్ బౌలర్లు, ఐదో సెట్లో స్పిన్నర్లను చేర్చారు. మినీవేలంలో సెట్ల వారీగా వేలం వేయనున్నారు. మినీ వేలంలో పాల్గొనే 10 ఫ్రాంచైజీల వద్ద మొత్తం రూ.206.5 కోట్ల పర్స్‌మనీ ఉంది. ఈ డబ్బులతోనే గరిష్టంగా 87 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి.
కేన్ విలియమ్సన్, జో రూట్, బెన్‌స్టోక్స్ సహా పలువురు ఆటగాళ్లు కూడా ఈసారి వేలంలో పాల్గొంటున్నారు. గతేడాది జరిగిన మెగా వేలంలో అనారోగ్యానికి గురైన వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మీడెస్ ఈసారి వేలాన్ని నిర్వహిస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కెప్టెన్ కోసం వెతుకుతుండగా, కోల్‌కతా నైట్‌రైడర్స్ విన్నర్ల కోసం చూస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల కోసం ఎదురుచూస్తోంది. పొలార్డ్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం ముంబై ఇండియన్స్ వెతుకుతోంది.
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్స్ సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, ఆసీస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జో రూట్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజాకు భారీ డిమాండ్ ఉండొచ్చు. పంజాబ్ వదిలేసిన టీమిండియా ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ వేలానికి రానున్నాడు. మళ్లీ భారత జట్టులో చోటు ఆశిస్తున్న అగర్వాల్‌కు ఐపీఎల్లో రాణించడం ఎంతో కీలకం. అన్ క్యాప్డ్ ప్లేయర్లు శివమ్ మావి, జగదీశన్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించొచ్చు. కాగా, ఇంగ్లండ్ ప్లేయర్లు హేల్స్, బిల్లింగ్స్, వోక్స్, రెహాన్ అహ్మద్‌తోపాటు ఆసీస్ కెప్టెన్ కమిన్స్ వేలంనుంచి వైదొలిగారు.