లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచులో లక్నో సూపర్ విక్టరీ కొట్టింది. 194 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీని మార్క్ వుడ్ బెంబెలెత్తించాడు. మార్క్ వుడ్ పేస్ ధాటికి ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసింది. దీంతో.. 50 పరుగుల తేడాతో లక్నో విక్టరీ కొట్టింది. ఢిల్లీ బ్యాటర్లలో వార్నర్ బాబాయ్ ( 48 బంతుల్లో 56 పరుగులు; 7 ఫోర్లు ) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. రిలీ రస్సో ( 20 బంతుల్లో 30 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించినా అప్పటికే ఆలస్యమైంది. పృథ్వీ షా (12), మిచెల్ మార్ష్ (0), సర్ఫరాజ్ ఖాన్ (4) నిరాశపర్చారు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్ నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లుతో దుమ్మురేపాడు. అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.
194 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ నాలుగు ఓవర్లలో దూకుడుగా ఆడింది. వార్నర్, పృథ్వీషా బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే.. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ మార్క్ వుడ్ రాకతో ఇన్నింగ్స్ స్వరూపమే ఒక్కసారిగా మారిపోయింది. వరుస బంతుల్లో పృథ్వీ షా, మిచెల్ మార్ష్ ను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ కాసేపటికే సర్ఫరాజ్ ఖాన్ కూడా ఔట్ చేసి.. ఢిల్లీ కష్టాల్ని మరింత పెంచాడు.
అయితే.. రిలీ రసో కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ.. ఈ సారి రవి బిష్ణోయ్ ఢిల్లీ క్యాపిటల్స్ ను దెబ్బ తీశాడు. రిలీ రస్సో, పావెల్ ను స్వల్ప విరామాల్లో ఔట్ చేశాడు. దీంతో.. 94 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది ఢిల్లీ. ఓ వైపు.. వికెట్లు పడుతున్నా.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు వార్నర్. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత వార్నర్ కూడా ఔటవ్వడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఆఖర్లో అక్షర్ పటేల్ మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. ఆఖరి ఓవర్ లో మరో రెండు వికెట్ల తీసి.. మొత్తం ఐదు వికెట్లతో మెరిశాడు వుడ్.
అంతకముందు కైల్ మేయర్స్ సూపర్ ఇన్నింగ్స్ తో లక్నో భారీ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్ కైల్ మేయర్స్ (38 బంతుల్లో 73 పరుగులు ; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఆఖర్లో మరో విండీస్ వీరుడు నికోలస్ పూరన్ (21 బంతుల్లో 36 పరుగులు ; 2 ఫోర్లు, 3 సిక్సర్లు )తో పాటు కృనాల్ పాండ్యా (15 పరుగులు నాటౌట్), ఆయుష్ బదోని (18 పరుగులు) మెరుపులు మెరిపించారు. కేఎల్ రాహుల్ (8), దీపక్ హుడా (17), స్టొయినిస్ (12) నిరాశపర్చారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లకు చెరో వికెట్ దక్కింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, Cricket, David Warner, Delhi Capitals, IPL 2023, KL Rahul, Lucknow Super Giants