ఐపీఎల్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ లో మూడో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఢిల్లీ. గత సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. అద్భుతంగా రాణించింది. అయితే, ప్లే ఆఫ్ మ్యాచులో చేతులేత్తేసింది. కానీ, లీగ్ మ్యాచుల్లో సూపర్ ఆటతో ఆకట్టుకుంది. ఈ సీజన్‌లో కూడా అదే ఆటతీరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. మరోవైపు రిషబ్ పంత్ జట్టుకు దూరమవ్వడంతో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో ఢిల్లీ బరిలోకి దిగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ నెగ్గలేదు. ఈ సారైనా టైటిల్ లేని లోటు తీర్చుకోవాలని బరిలోకి దిగుతుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు..
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు లక్నో, ఢిల్లీ మధ్య 2 మ్యాచ్‌లు జరగ్గా. రెండు మ్యాచ్‌ల్లోనూ లక్నో సూపర్ జెయింట్ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో.. రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గణాంకాలను చూస్తే లక్నో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అయితే డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని ఢిల్లీ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. కెప్టెన్‌గా వార్నర్‌కు ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉండడం కలిసి వచ్చే అంశం.
పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, డేవిడ్ వార్నర్ వంటి మ్యాచ్ విన్నర్లు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నారు.బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ కీలకం కానున్నారు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నికోలస్ పూరన్, దీపక్ హుడా, స్టోయినిస్ వంటి భీకరమైన బ్యాటింగ్ లైనప్ లక్నో సొంతం. బౌలింగ్‌లో మార్క్ వుడ్, అవేశ్ ఖాన్, రవి బిష్టోయ్ కీలకం కానున్నారు. రెండు జట్లు కూడా సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్స్ సేవల్ని ఈ మ్యాచులో కోల్పోనుంది.
పిచ్ రిపోర్ట్..
పిచ్ బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్‌లకు సమానంగా సహరిస్తుంది. బ్యాట్‌కు, బంతికి మధ్య ఆసక్తికర సమరం ఉండనుంది. ఈ గ్రౌండ్‌లో జరిగిన 6 టీ20 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 5 సార్లు విజయం సాధించింది. టాస్ ఇక్కడ కీ రోల్ ప్లే చేయనుంది.
తుది జట్లు :
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, మార్క్ వుడ్, అవేష్ ఖాన్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్.
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, రిలే రోసో, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, David Warner, Delhi Capitals, IPL 2023, KL Rahul, Lucknow Super Giants