CSK vs GT Live Scores: ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) సూపర్ విక్టరీని అందుకుంది. గురువు మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)పై శిష్యుడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya)దే పైచేయిగా నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై గెలుపొంది టోర్నీలో శుభారంభం చేసింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసి నెగ్గింది. శుబ్ మన్ గిల్ (36 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి మ్యాచ్ ఆడుతోన్న చెన్నై బైలర్ రాజవర్ధన్ 3 వికెట్లు తీశాడు.
ఆఖరి రెండు ఓవర్లలో గుజరాత్ విజయం కోసం 12 బంతుల్లో 23 పరుగులు చేయాలి. క్రీజులో రాహుల్ తెవాటియాతో పాటు అప్పుడే బ్యాటింగ్ వచ్చిన రషీద్ ఖాన్ ఉన్నాడు. తెవాటియా పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో 12 బంతుల్లో 23 పరుగులు చేయడం గుజరాత్ కు చాలా కష్టంగా కనిపించింది. 19వ ఓవర్ వేసిన దీపక్ చహర్ తొలి మూడు బంతులకు కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే స్ట్రయికింగ్ ఎండ్ లోకి వచ్చిన రషీద్ ఖాన్ ఎదుర్కొన్న తొలి బంతినే లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాతి బంతిని ఫోర్ కొట్టాడు. అంతే గుజరాత్ లక్ష్యం 6 బంతులకు 8 పరుగులకు దిగొచ్చింది. అప్పటి వరకు భారీ షాట్లు ఆడటంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ తెవాటియా.. 20 ఓవర్ లో వరుసగా 6, 4 బాది మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. అంతకుముందు శుబ్ మన్ గిల్ మంచి ఇన్నింగ్స్ తో అలరించాడు. కేన్ విలియమ్సన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సాయి సుదర్శన్ (22) ఫర్వాలేదనిపంచాడు. అయితే సాహా, హార్దిక్ పాండ్యా విఫలం అయ్యారు. చాలా రోజుల తర్వాత విజయ్ శంకర్ (27) రాణించాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 92; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) ఊర మాస్ ఇన్నింగ్స్ తో అలరించాడు. అయితే త్రుటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. మొయిన్ అలీ (23) ఫర్వాలేదనిపించాడు. చివర్లో ధోని (7 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) సూపర్ ఫినిష్ ఇచ్చాడు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, షమీలకు తలా రెండు వికెట్లు లభించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Gujarat Titans, Hardik Pandya, IPL 2023, MS Dhoni, Rashid Khan, Ravindra Jadeja, Shubman Gill