IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్ కు కౌంట్ డౌన్ మొదలయ్యింది. మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 16వ సీజన్ ఘనంగా ఆరంభం కానుంది. ఇక తొలి మ్యాచ్ లో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడనుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం చెపాక్ స్టేడియంలో తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. కెప్టెన్ ధోని నెట్స్ లో చెమటోడుస్తున్నాడు. ఈ క్రమంలో ధోనికి సంబంధించిన ఒక ఆసక్తికర వీడియోను అభిమానుల కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీనికి ‘ది మల్టీవర్స్ మహీ‘ అనే క్యాప్షన్ ను కూడా జతచేసింది.
ప్రాక్టీస్ సెషన్ లో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వికెట్ల వెనుక ఉండే ధోని.. బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం వింతే. లెగ్ స్పిన్ వేస్తూ నెట్స్ లో ధోని కనిపించాడు. దీనిని చెన్నై సూపర్ కింగ్స్ కెమెరాలో బంధించింది. అనంతరం ఎవరికీ రాని ఆలోచనతో ఒక అద్భుతమైన వీడియోను రూపొందించింది. అదేంటంటే.. ధోని బ్యాటింగ్ చేస్తున్న వీడియో క్లిప్స్.. బౌలింగ్ చేస్తున్న క్లిప్స్ లతో ఒక కొత్త వీడియోను రూపొందించింది. ఈ వీడియో చూస్తే ఏకకాలంలో ధోని బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. తన బౌలింగ్ లోనే ధోని ప్రాక్టీస్ చేస్తున్నట్లు అనిపించేలా చెన్నై టీం ఈ వీడియోను ఎడిట్ చేసింది. ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం ధోని వయసు 41 ఏళ్లు. ఈ క్రమంలో ధోనికి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. చెపాక్ లో ధోనికి గ్రాండ్ ఫేర్ వెల్ గేమ్ కూడా ఉంటుందని.. ఇందుకోసం ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 4 సార్లు చాంపియన్ గా నిలిచింది. మరో 5 సార్లు రన్నరప్ గా నిలిచింది. కేవలం రెండు సార్లు (2020, 2022) మాత్రమే ప్లే ఆఫ్స్ కు చేరడంలో విఫలం అయ్యింది. ఆ రెండు సీజన్ లలో మినహా ఆడిన ప్రతి సీజన్ లోనూ కనీసం ప్లే ఆఫ్స్ కు చెన్నై అర్హత సాధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Csk, Indian premier league, IPL, IPL 2023, MS Dhoni