Virat Kohli : విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఏమైంది. ఇప్పుడు ప్రతి క్రికెట్ అభిమాని మదిలో ఇదే ప్రశ్న.. 2015లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. అని ఎల ా డిస్కషన్స్ చేశారో.. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎందుకు ఇలా ఆడుతున్నాడు? అంటూ క్రికెట్ లవర్స్ డిస్కషన్స్ చేస్తున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers bangalore) కెప్టెన్సీ నుంచి గతేడాది తప్పుకున్న అతడు.. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ కేవలం 125 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీకి ఈ సీజన్ లో ఒక్క అర్ధ సెంచరీ లేకపోవడం విశేషం. 2016 ఐపీఎల్ సీజన్ లో ఎవరూ చేయనంతగా 973 పరుగులు చేసిన అతడు ఈ సీజన్ లో మాత్రం సింగిల్స్ తీయడానికే ఆపసోపాలు పడుతున్నాడు.
విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో వరుసగా 41 నాటౌట్, 12, 5, 48, 1, 12, 0, 0, 6 పరుగులు చేశాడు. ఒకానొక సమయంలో మంచినీళ్లు తాగినట్లు సెంచరీలు చేసిన కోహ్లీ.. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. కేవలం రెండు పర్యాయాలు మాత్రమే 40 ప్లస్ సాధించాడు. ఇంతలా కోహ్లీ విఫలం కావడానిక కారణం ఏంటి? అనేది అటు క్రికెట్ పండితులకు ఇటు క్రికెట్ ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. ఫిట్ గా ఉంటూ వికెట్ల మధ్య చాలా వేగంగా పరుగెత్తే విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో రెండు పర్యాయాలు రనౌట్ కావడం గమనార్హం. ఇక లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాాబాద్ జట్లపై గోల్డెన్ డక్ గా వెనుదిరిగిన విరాట్ కోహ్లీ.. మంగళవారం రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చాడు. అయినా అతడి ఆటతీరులో మార్పు కనిపించలేదు. బౌల్ట్ బౌలింగ్ లో ఫోర్ బాదిన అతడు.. ప్రసిధ్ కృష్ణ వేసిన బౌన్సర్ కు పెవిలియన్ బాట పట్టాడు.
ఆ బంతులను ఆడలేకపోతున్నాడు
విరాట్ కోహ్లీ బలహీనతను బౌలర్లు పట్టేసినట్లు కనిపిస్తున్నారు. ఆఫ్ స్టంప్ కు కాస్త దూరంగా వేసే బంతులను వేటాడుతూ కోహ్లీ పెవిలియన్ కు చేరుతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ ల్లో విరాట్ కోహ్లీ ఈ విధంగానే అవుటయ్యాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో క్విక్ బౌన్సర్ కు అవుటయ్యాడు. అదే సమయంలో మితిమీరిన క్రికెట్ కూడా విరాట్ కోహ్లీపై తీవ్ర ఒత్తిడిని కలిగేలా చేస్తుండవచ్చు. గత కొన్నేళ్లుగా భారత జట్టు మితిమీరిన క్రికెట్ ఆడుతూనే ఉంది. ఒక సిరీస్ ముగిస్తే మరో సిరీస్ ఇలా తీరిక లేని షెడ్యూల్ తో బిజీ బిజీ గా గడుపుతోంది. ఇక మధ్యలో ఐపీఎల్.. ఇంతటి బిజీ షెడ్యూల్ తో ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోతున్నారు. ఈ ఒత్తిడి కూడా కోహ్లీ వైఫల్యానికి ఒక కారణం అయి ఉండొచ్చు.
మెడ పై వేలాడుతున్న కత్తి
గతంలోలాగా టీమిండియాలో విరాట్ ఆడిందే ఆటగా సాగే రోజులు కావు ఇవి. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత నుంచి కూడా కోహ్లీకి బీసీసీఐకి మధ్య పొసగడం లేదనే వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట కోహ్లీ టి20ల నుంచి మాత్రమే తప్పుకోగా.. ఆ తర్వాత బీసీసీఐ అతడిని వన్డేల నుంచి తప్పించింది. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్ లో టెస్టు సిరీస్ లో తీవ్రంగా విఫలమైన తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దాంతో అతడు కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. అంతేకాకుండా టీమిండియాలో చోటు కోసం చాలా మంది యువ ప్లేయర్స్ వేచి చూస్తూ ఉన్నారు. ఈ ఐపీఎల్ నే చూసుకుంటే తిలక్ వర్మ, ఆయుశ్ బదోని లాంటి ప్లేయర్స్ సత్తా చాటారు. ఇక గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. మునపటిలా భారీ షాట్లు ఆడకపోయినా.. మిడిలార్డర్ లో చక్కగా రాణిస్తున్నాడు. అంతేకాకుండా మూడో స్థానం నా డ్రీమ్ అంటూ కామెంట్స్ కూడా చేశాడు. అంటే కోహ్లీ స్థానం కోసం హార్దిక్ పాండ్యా రేసులో ఉన్నట్లే లెక్క. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సీజన్ లో పెద్దగా రాణించడం లేదు. కానీ అతడు కెప్టెన్ కాబట్టి అతడిపై వేటు పడే అవకాశం లేదు. ప్రస్తుతానికి అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫామ్ లోకి వస్తే బాగుంటుంది. లేదంటే.. కోహ్లీపై వేటు తప్పకపోవచ్చు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Hardik Pandya, IPL, IPL 2022, Lucknow Super Giants, Rajasthan Royals, RCB, Rohit sharma, Royal Challengers Bangalore, Sourav Ganguly, Sunrisers Hyderabad, Team India, Virat kohli