IPL 2022 - Mumbai Indians : ఈ సారి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో లీగ్ సరికొత్తగా ఉండనుంది. కొత్త జట్లతో రాకతో మెగా వేలం అనివార్యమవ్వగా.. ఆయా జట్ల ఆటగాళ్లంతా మారారు. ఈ క్రమంలోనే అత్యంత బలమైన కోర్ టీమ్ కలిగిన ముంబై ఇండియన్స్ చెల్లా చెదురైంది. గత సీజన్ మాదిరి బలంగా అయితే కనిపించడం లేదు.
ఆరంభంలో ఇబ్బంది పడడం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడటం... ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) శైలి ఇది. ఆటలోనే కాదు టైటిల్స్ నెగ్గడంలోనూ ఆ జట్టు తీరు అదే. తొలి ఐదు సీజన్లలో ఒకేసారి ఫైనల్ వరకూ వచ్చిన ముంబై.. తర్వాతి ఎనిమిది సీజన్లలో ఏకంగా ఐదు టైటిల్స్ నెగ్గింది. 2013, 2015, 2017, 2019, 2020 ల్లో ఛాంపియన్ గా నిలిచింది. ఈ జట్టుకు రోహిత్ శర్మప్రాతినిధ్యం వహిస్తుండగా మహేల జయవర్ధనే కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఐదు ట్రోఫీలు రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోనే రావడం విశేషం. దిగ్గజ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) తర్వాత అంతటి ప్రశాంతంగా ఉండే కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న హిట్‌మ్యాన్.. ఐపీఎల్ రికార్డులతోనే టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. పరిస్థితులు అనుకూలించక గత సీజన్లో ప్లే ఆఫ్స్ చేరలేకపోయిన ముంబై ఇండియన్స్ ఈ సారి మళ్లీ టైటిల్ కొట్టి తమ బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలనుకుంటుంది.
ఈ సారి మెగావేలంలో ఇషాన్ కిషన్ కోసం భారీగా ఖర్చు పెట్టింది. అతని కోసం ఎన్నడూ లేని విధంగా రూ.15.25 కోట్లు ఖర్చు పెట్టింది. వేలంలో ఓ ఆటగాడి కోసం ముంబై రూ. 10 కోట్లు ధాటి ఖర్చు పెట్టడం ఇదే తొలిసారి. అంతేకాకుండా అప్ కమింగ్ సీజన్ ఆడని జోఫ్రా ఆర్చర్‌ను భవిష్యత్తు కోసం కొనుగోలు చేసింది. అతని కోసం రూ. 8 కోట్లు ఖర్చు చేసింది. ఇక హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమ్ డేవిడ్‌ను తీసుకున్న ముంబై.. అతని కోసం రూ.8.25 కోట్లు ఖర్చు చేసింది. దాంతో ఈ ముగ్గురు ఆటగాళ్ల కోసం ముంబై పర్స్ మనీలో నుంచి రూ.33.5 కోట్లు ఖర్చు పెట్టింది.
ముంబై ఇండియన్స్ ఎప్పుడూ అనామక ఆటగాళ్లను స్టార్లుగా మార్చి మంచి టీమ్‌ను తయారు చేసుకుంటుంది. వాళ్లు తీసుకునే అనామక ఆటగాళ్లపై ఆ టీమ్ సపోర్ట్ స్టాఫ్ మంచి గ్రౌండ్ వర్క్ చేస్తుంది. గతంలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, అంబటి రాయుడు వంటి ఆటగాళ్లంతా ముంబైలోకి అనామక ఆటగాళ్లుగా ఎంట్రీ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టార్లుగా ఎదిగినవారే. కాబట్టి ఆ జట్టు పేపర్‌పై ఈ సారి బలహీనంగా కనిపిస్తున్నా.. టోర్నీ సమయానికి స్ట్రాంగ్‌గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మకు మంచి ఫ్యూచర్ ఉండనుంది. అనామక ఆటగాళ్లంతా స్టార్లుగా మారే చాన్సుంది.
ముంబై ఇండియన్స్ టీమ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలక ఆటగాళ్లు. మెగా వేలంలో ఇషాన్‌ను రూ. 15.25 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. అలానే పేసర్లు జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, జయ్‌దేవ్ ఉనద్కత్‌ను కొనుగోలు చేసింది. అయితే జోఫ్రా ఆర్చర్ వచ్చే సీజన్ నుంచి అందుబాటులో ఉండనున్నాడు. అయితే జట్టులోని 25 మందిలో సగం మంది పెద్దగా తెలియని ఆటగాళ్లే. అయితే రంజీ సహా ఇతర దేశవాళీ టోర్నీల్లో రాణించడంతో ముంబై వారిని కొనుగోలు చేసింది. కాబట్టి వారిని మ్యాచ్‌లకు అనుగుణంగా మార్చుకోగలదు.
ముంబై ఇండియన్స్‌కు ఓపెనింగ్ సమస్య లేదు. రోహిత్ శర్మతో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. ఇందులో సందేహం లేదు. కానీ అతను గాయపడితే బ్యాకప్ ఓపెనర్ ఎవరా? అనేది టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయించాల్సి ఉంటుంది. పేరు మోసిన ఆల్‌రౌండర్లు కూడా లేరు. కీరన్ పొలార్డ్ రూపంలో బిగ్ హిట్టర్ ఉన్నా.. ఇటీవల అతని ఫామ్ మరి పేలవంగా ఉంది. గత సీజన్లో ఆల్‌రౌండర్లు రాణించకపోవడంతో లీగ్ దశకే ముంబై పరిమితం కావాల్సి వచ్చింది. ఫాబియన్ అలెన్ హార్డ్ హిట్టరే. ఇక ఆసీస్ ఆటగాడు డానియల్ సామ్స్ పేస్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేస్తాడు. అయితే విదేశీ ఆటగాళ్లు తుది జట్టులో నలుగురు మాత్రమే ఉండాలనే నిబందన ఉండటంతో వీరికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే.
గతంతో పోలిస్తే బౌలింగ్ విభాగం కూడా బలహీనంగానే కనిపిస్తోంది. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా మినహా మరో చెప్పుకొతగ్గ బౌలర్ లేడు. జోఫ్రా ఆర్చర్‌ను తీసుకున్నా అతను ఈ సీజన్ ఆడటం లేదు. జయ్‌దేవ్ ఉనద్కత్, రీలే మెరెడిత్, మిల్స్, బసిల్ థంపి రూపంలో పేసర్లు ఉన్నప్పటికీ వీళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా అనిపిస్తోంది. మురుగన్ అశ్విన్, అన్మోల్ ప్రీత్ సింగ్, డేవాల్డ్ బ్రెవిస్ ఉన్నప్పటికీ వీరిలో ఎవరికీ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. కుర్రాళ్లు సత్తా చాటితేనే ముంబై లీగ్‌లో ముందుకు కొనసాగగలదు. లేకుంటే గత సీజన్ మాదిరే గ్రూప్ దశలోనే ఇంటిదారిపట్టవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.