ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) కు సంబంధించి ఆటగాళ్ల మెగా వేలం (IPL Mega Auction 2022) ప్రక్రియ మొదటి రోజు హోరాహోరీగా సాగింది. గెలుపు గుర్రాలు కోసం తగ్గేదే లే అన్నట్టు పోరాడాయ్ అన్నీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు.
ఈసారి రెండు కొత్తవాటితో కలిపి మొత్తం పది జట్లు ఆటగాళ్ల కొనుగోళ్లకు పోటీపడ్డాయి. బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం తొలిరోజున జాబితాలో మొత్తం 161 మంది ఆటగాళ్లున్నా, కేవలం 97 మంది మాత్రమే వేలంలోకి వచ్చారు. అందులో 74 మంది ఆటగాళ్లే అమ్ముడుపోయారు. 23 మంది ప్లేయర్లను ఎవరూ కొనలేదు. ఐపీఎల్ 2022 వేలంలో కొందరి ఆటగాళ్లకు ఊహించని ధర పలకగా.. మరికొందరికి అనుకున్న దానికంటే చాలా తక్కువ ధర పలికింది. ఇక కొందరు స్టార్ ఆటగాళ్లకు వేలంలో చుక్కెదురు కాగా.. అనామక ఆటగాళ్లకు భారీ ధర పలికింది. ఏదేమైనా వేలం మాత్రం రసవత్తరంగా సాగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఇక, తొలి రోజు వేలం తర్వాత ఏ జట్టు దగ్గర ఎంత మొత్తం ఉందో ఓ లుక్కేద్దాం.
జట్లు | మిగిలిన మొత్తం | విదేశీ ప్లేయర్స్ | మొత్తం ఆటగాళ్లు | మినిమమ్ ఇంకా కావాల్సిన ఆటగాళ్లు.. |
చెన్నై | ₹20,45,00,000 | 2 | 10 | 8 |
ఢిల్లీ | ₹16,50,00,000 | 4 | 13 | 5 |
గుజరాత్ | ₹18,85,00,000 | 4 | 10 | 8 |
కోల్ కతా | ₹12,65,00,000 | 3 | 9 | 9 |
లక్నో | ₹6,90,00,000 | 4 | 11 | 7 |
ముంబై | ₹27,85,00,000 | 2 | 8 | 10 |
పంజాబ్ | ₹28,65,00,000 | 2 | 11 | 7 |
రాజస్థాన్ | ₹12,15,00,000 | 3 | 11 | 7 |
బెంగళూరు | ₹9,25,00,000 | 4 | 11 | 7 |
హైదరాబాద్ | ₹20,15,00,000 | 2 | 13 | 5 |
రెండోరోజు, ఆదివారం అక్సెలరేటెడ్ విధానం మొదలవుతుంది. అంటే తొలిరోజు వేలంలో 161 మందిలో మిగిలిన ఆటగాళ్లు సెట్ల వారీగా వేలానికి వస్తారు. ఆ తర్వాత అక్సెలరేటెడ్ విధానం మొదలవుతుంది. మిగిలిన వారి కోసం ఫ్రాంఛైజీలు పోటీపడతాయి. వీరిలో తమకు నచ్చిన వారిని ఫ్రాంఛైజీలు ప్రతిపాదిస్తాయి. ఇలా ప్రతిపాదించిన జాబితా నుంచి ఆటగాళ్లను ఎంచుకుంటారు. ఆ ఆటగాళ్ల కోసం జట్లు పోటీ పడనున్నాయ్.
రైట్ టు మ్యాచ్ ఆప్షన్ లేదు
2018 ఐపీఎల్ మెగా వేలం మాదిరిగా ఈసారి రైట్ టు మ్యాచ్ కార్డ్స్ అందుబాటులో లేవు. కొత్తగా రెండు జట్లు ఐపీఎల్లో చేరిన నేపథ్యంలో ఆ జట్లు బలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ సదుపాయాన్ని తీసేశారు.
సైలెంట్ టైబ్రేకర్
2010 ఐపీఎల్ వేలం నుంచి సైలెంట్ టై బ్రేకర్ ఉంది. కానీ ఇప్పటిదాకా దీన్ని ఉపయోగించలేదు. ఒక ఆటగాడి కోసం రెండు జట్లు పోటీపడుతున్నప్పుడు అది వారికి చివరి బిడ్ అయినప్పుడు.. రెండు జట్లకు సమాన మొత్తంలో డబ్బులు అందుబాటులో ఉన్నప్పుడు ఇది అమల్లోకి వస్తుంది. తాము ఆ ఆటగాడికి ఇంతే డబ్బులు చెల్లిస్తామని రెండు జట్లు లిఖిత పూర్వకంగా బిడ్ వేయాల్సి ఉంటుంది. ఈ టైబ్రేక్ బిడ్ ద్వారా చెల్లించే మొత్తాన్ని వారికి అందుబాటులో ఉన్న డబ్బు నుంచి తీసుకోరు. ప్రత్యేకంగా బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2022, IPL Auction 2022, Sunrisers Hyderabad