క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) ఈ నెల 26న ఘనంగా ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 15వ సీజన్ మొత్తం (Maharashtra) వేదికగానే జరిపేందుకు బీసీసీఐ (BCCI) అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముంబైలోని మూడు స్టేడియాలతో పాటు పుణేలోని ఓ స్టేడియంలో మొత్తం 70 లీగ్ మ్యాచ్ లను జరిపేలా షెడ్యూల్ ను రూపొందించింది. ఇక ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల తేదీలు వేదికలు ఖరారు కావాల్సి ఉంది. ఇక, ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు.. తమ ట్రైనింగ్ క్యాంపుల్ని కూడా మొదలుపెట్టాయ్. విదేశీ, స్వదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరు వచ్చి తమ జట్లతో చేరుతున్నారు. అయితే, సీజన్ దగ్గరపడుతున్న వేళ కలకలం రేగింది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)కు చెందిన బస్సుపై దాడి జరగడం కలకలం రేపుతోంది. ముంబైలో మార్చి 15 అర్ధరాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై రాజ్ థాక్రే నేత్రుత్వంలోని నవనిర్మాణ్ సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో బీసీసీఐ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఆ సమయంలో బస్సులో ఆటగాళ్లెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అదే, ఆటగాళ్లు ఉండి ఉంటే.. బీసీసీఐ పరువు పోయి ఉండేది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం నవనిర్మాణ్ సేనకు చెందిన దాదాపు 12 మంది కార్యకర్తలు బస్సుపై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. బస్సు పార్క్ చేసిన తాజ్ ప్యాలెస్ వద్దకు చేరుకుని ఐపీఎల్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు కొన్ని పోస్టర్లను అంటించారు. నవనిర్మాణ్ సేన నేత సంజయ్ నాయక్ మాట్లాడుతూ.. ఐపీఎల్ కోసం ఇతర రాష్ట్రాల నుంచి బస్సులను తీసుకున్నారని... ఓవైపు స్థానికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే ఇలా బయటి రాష్ట్రాల నుంచి బస్సులు తీసుకురావడమేంటని ప్రశ్నించారు.
ముంబైలో మార్చి 15 అర్ధరాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ బస్సుపై రాజ్ థాక్రే నేత్రుత్వంలోని నవనిర్మాణ్ సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. #Bumbai #IPL #Busattack pic.twitter.com/WQlJ3lR1YT
— News18 Telugu (@News18Telugu) March 17, 2022
ఓవైపు తాము నిరసన తెలుపుతున్నా ఐపీఎల్ యాజమాన్యం ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుంచి బస్సులను తీసుకొస్తోందన్నారు. ఇది మరాఠీ ప్రజల ఉపాధిని దెబ్బతీస్తోందని.. అందుకే దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్ బస్సుపై దాడికి సంబంధించి కొలాబా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇది కూడా చదవండి : బయో బబుల్ కొత్త రూల్స్ ఇవే... నిబంధనలు అతిక్రమిస్తే తాట తీసేందుకు సిద్ధమైన బీసీసీఐ
ఐపీసీ సెక్షన్ 143, 147, 149, 427ల కింద కేసు నమోదు చేసి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తాజ్ ప్యాలెస్‌లో బస చేస్తోంది. మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. బ్రౌబోర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే, మ్యాచుకు పది రోజుల ముందు ఇలాంటి ఘటన జరగడం షాకే అని చెప్పాలి. ముందు ముందు ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. లేకపోతే.. ఐపీఎల్ కు ఉన్న పేరు కాస్తా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.