ఐపీఎల్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్. తిరుగులేని నాయకుడు. కానీ, ప్రస్తుత ఐపీఎల్లో 3 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఇంకా ఖాతా తెరవలేదు. అవును.. ఆ జట్టే ముంబై ఇండియన్స్ (Mumbai Indians). అత్యంత చెత్త ప్రదర్శనతో ఈ సారి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది రోహిత్ సేన. మెగా వేలానికి ముందు ప్రతి జట్లు ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను ఉంచుకుని మిగిలిన వారిని విడుదల చేయాలని ఐపీఎల్ యాజమాన్యం కోరింది. దీంతో ముంబై ఇండియన్స్ ముఖ్యమైన ఆటగాళ్లను కొందరిని ఉంచుకోలేని పరిస్థితిని ఎదుర్కొంది. తర్వాత వేలంలోనూ కావాల్సిన వారిని దక్కించుకోలేకపోయింది. దీంతో, గత సీజన్ వరకు స్ట్రాంగ్ గా ఉన్నా ముంబై ఇండియన్స్ ఇప్పుడు చెల్లా చెదురైంది. దీంతో, ఓ సాధారణ జట్టులా మారిపోయింది.
ముంబై జట్టు ఆడే విధానం, పరిస్థితులు మునుపటిలా లేవు. జట్టు పూర్తిగా మారిపోయింది. బ్యాటింగ్‌లో కొరత లేకపోయినప్పటికీ.. బౌలింగ్‌లో చాలా బలహీనంగా కనిపిస్తోంది. గతంలో బుమ్రా, బౌల్ట్, కృనాల్, రాహుల్ చాహర్‌తో బలంగా కనిపించే బౌలింగ్ లైనప్ ఈసారి లేదు. బుమ్రాకు సహకారం అందించే మరో బౌలర్ కరవయ్యాడు.పేసర్లు టైమల్ మిల్స్, డేనియల్ సామ్స్, బాసిల్ థంపి ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. బౌలింగ్‌లో మెరుగుపడకుంటే ఈసారి ముంబై ప్లేఆఫ్స్ చేరడం కష్టమే అని చెప్పొచ్చు.
అయితే, ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా స్పందించాడు. జైదేవ్ ఉనద్కత్‌ను ముంబై తుది జట్టులోకి తీసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన ఉనద్కత్‌ను బెంచ్‌కే ఎందుకు పరిమితం చేస్తున్నారో అర్ధం కావడంలేదు అని తెలిపాడు.
"గత ఏడాది సీజన్ వరకు ముంబై జట్టులో నాథన్ కౌల్టర్ నైల్ ఉండేవాడు. జట్టులో ఏ బౌలరైనా బాగా రాణించకపోయినా లేదా గాయపడినా కౌల్టర్ నైల్ జట్టులోకి వచ్చేవాడు. అయితే ఇప్పుడు మాత్రం ముంబై మేనేజ్మెంట్ బెంచ్‌లో ఉన్నవారికి తుది జట్టులో అవకాశం ఇవ్వడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్, అర్షద్ ఖాన్ వంటి వారు ఇంకా బెంచ్‌కే పరిమితం అవుతున్నారు. అంతే కాకుండా సంజయ్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్ వంటి యువ ఆల్ రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. జట్టులో బాసిల్ థంపి, డేనియల్ సామ్స్ అంతగా రాణించడం లేదు. వీరిద్దరి స్థానాల్లో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి.
ఇది కూడా చదవండి : అందుకే కదా నిన్ను సర్ జడేజా అనేది.. ఏమన్నా టాలెంటా.. వైరలవుతున్న వీడియో..
అయితే, ముంబై మాత్రం తమ తుది జట్టులోకి జయదేవ్ ఉనద్కత్‌ను తీసుకునే సమయం వచ్చింది. అతడికి ఐపీఎల్లో చాలా అనుభవం ఉంది. గతంలో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ తరపున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అదే విధంగా ఐపీఎల్ 2018 వేలంలో ఉనద్కత్ 11.5 కోట్లకు అమ్ముడు పోయాడు. అయితే అతడు తన తర్వాత సీజన్లో అంతగా రాణించలేక పోయాడు. అయినప్పటికీ ఐపీఎల్లో అతడికి ఉన్న అనుభవం దృష్ట్యా బుమ్రాకు అతడే సరైన జోడి" అని సెహ్వాగ్ తన అభిప్రాయం వెల్లడించాడు. మరీ, సెహ్వాగ్ చెప్పినట్టు జట్టులో మార్పులు చేసి ముంబై విజయాల బాట పడుతుందో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2022, Mumbai Indians, Rohit sharma, Virender Sehwag