ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ కోసం క్రికెట్ ప్రియులు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. బీసీసీఐ కూడా ఐపీఎల్ 15వ ఎడిషన్‌ను త్వరగా స్టార్ట్ చేయాలని వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌లోని పరిస్థితులకు అనుగుణంగా బీసీసీఐ (BCCI) ఐపీఎల్ ప్లాన్స్ మార్చుతోంది. మెగా వేలాన్ని (IPL Mega Auction) వాయిదా వేయడంతో పాటు ఐపీఎల్ టోర్నీని పూర్తిగా ముంబై (Mumbai)లోనే నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక, లేటెస్ట్ గా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది బీసీసీఐ. ఐపీఎల్‌కు కొత్త స్పాన్సర్ వచ్చింది. మన దేశానికే చెందిన టాటా గ్రూప్ సంస్థ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 2022, 2023 అంటే రెండు సంవత్సరాల పాటు టాటా సంస్థ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉంటుంది.
దీంతో ప్రస్తుతం టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న చైనీస్ కంపెనీ వివో తప్పుకోనుంది. నిజానికి కాంట్రాక్ట్ ప్రకారం చైనా మొబైల్ కంపెనీ వివోకు మరో రెండేళ్లు సమయం ఉంది. కానీ 2020లో భారత్, చైనా సరిహద్దుల్లో వివాదం నెలకొనడంతో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వివోను తొలిగించాలని అప్పటి నుంచి డిమాండ్లు వస్తున్నాయి.
దీంతో 2020లో బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా వివోను తొలగించి డ్రీమ్ 11కు అవకాశం ఇచ్చింది. గతేడాది కూడా వివోను స్పాన్సర్‌గా తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. కానీ బీసీసీఐ అలాగే కొనసాగించింది. 2018 నుంచి 2022 వరకు ఐదేళ్ల కాలానికి టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు చైనా కంపెనీ వివో బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది.
ఇందుకోసం ప్రతి ఏడాది బీసీసీఐకి 440 కోట్ల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది. కానీ ప్రస్తుత వ్యతిరేక పరిస్థితుల్లో ముందుగానే కాంట్రాక్టును రద్దు చేసుకునేందుకు చైనా కంపెనీ వివో ఒప్పుకుంది. ఐపీఎల్ ఈ ఏడాది 10 జట్లతో జరగనుంది. 2011 తర్వాత ఐపీఎల్ మళ్లీ 10 జట్లతో జరగనుండడం గమనార్హం.
ఇప్పటికే ఉన్న కొత్త జట్లకు లక్నో, అహ్మదాబాద్ కలవనున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి ఐపీఎల్ వేసవిలోనే జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా కూడా పూర్తైంది. కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ తమ రిటెన్షన్ ఆటగాళ్లను ఎంచుకోవడానికి బీసీసీఐ ఈ నెల 31 వరకు గడువు ఇచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి షెడ్యూల్ ఖరారు చేయకపోయిన ఫిబ్రవరి మొదటి వారంలో ఐపీఎల్ మెగా వేలం జరిగే అవకాశం ఉంది. అలాగే ఏప్రిల్ సెకండాఫ్‌లో ఐపీఎల్ ప్రారంభం కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.